ipl: ఘన విజయంతో నిష్క్రమించిన చెన్నై

ipl: ఘన విజయంతో నిష్క్రమించిన చెన్నై
X
83 పరుగుల తేడాతో గుజరాత్‌ను చిత్తు చేసిన చెన్నై

ఐపీఎల్‌ 2025 సీజన్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్... ఘన విజయంతో ఈ సీజన్‌కు వీడ్కోలు పలికింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు షాకిస్తూ చెన్నై ఘన విజయం సాధించింది. ఏకంగా 83 పరుగుల తేడాతో గుజరాత్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌ చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. బ్యాటర్లలందరూ రాణించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. చెన్నైకి ఓపెనర్లు ఆయుష్‌ మాత్రే (34; 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవాన్ కాన్వే (52; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం అందించారు.**

పేకమేడలా కూలిన గుజరాత్‌

భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ తేలిపోయింది. కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (41) టాప్ స్కోరర్. శుభ్‌మన్ గిల్ (13), షారుక్ ఖాన్ (19), అర్షద్ ఖాన్ (20), రాహుల్ తెవాతియా (14), రషీద్ ఖాన్ (12) పరుగులు చేశారు. జోస్ బట్లర్ (5), రూథర్‌ఫోర్డ్ (0) ఘోరంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3, అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్‌, పతిరన ఒక్కో వికెట్ పడగొట్టారు.

అందువల్లే ఓడిపోయాం: గిల్

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై గుజరాత్ కెప్టెన్ గిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘పవర్ ప్లేలోనే మ్యాచ్ మా నుంచి దూరమైంది. 230 లక్ష్యాన్ని ఛేదించడం ఎప్పుడైనా కష్టమే. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న జట్లు పూర్తి స్వేచ్ఛతో ఆడుతున్నాయి. మేము ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండలేకపోయాం. మిడిల్ ఓవర్లలో రన్స్ ఆపడం చాల ముఖ్యం. అలా చేయకపోతే అది సవాలుగా ఉంటుంది. గత రెండు మ్యాచ్‌లలో అదే మిస్ అయ్యాం’ అని చెప్పాడు.

Tags

Next Story