IPL: చెన్నై ఓటముల హ్యాట్రిక్

IPL: చెన్నై ఓటముల హ్యాట్రిక్
X
చెన్నైకు వరుసగా మూడో ఓటమి... ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఘోర పరాజయం

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాల పరంపర కూడా కొనసాగుతోంది. మరో ఓటమిని చవిచూసి చెన్నై హ్యాట్రిక్‌ పరాజయాలను ఖాతాలో వేసుకుంది. అంచనాలు లేని ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడుతూ వరుసగా మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. చెపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా.. 5 వికెట్లు కోల్పోయిన చెన్నై ఓవర్లు పూర్తయ్యే వరకు 158 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది. 15 ఏళ్ల తర్వాత చెపాక్ లో సీఎస్కేపై ఢిల్లీకి ఇదే తొలి విక్టరీ. చివరగా 2010లో ఇక్కడ డీసీ గెలిచింది.

మెరిసిన రాహుల్

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‍లో అదరగొట్టింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77 పరుగులు; 6 పోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. బ్యాటింగ్‍కు కాస్త కష్టంగా ఉన్న చెపాక్ పిచ్‍పై రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‍కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (0) తొలి ఓవర్ ఐదో బంతికి డకౌట్ అయ్యాడు. దీంతో పరుగుల కంటే ముందుగా వికెట్ల ఖాతా ఓపెన్ అయింది. అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడాడు. అభిషేక్ పోరెల్ (20 బంతుల్లో 33 పరుగులు; 4 ఫోర్లు, ఓ సిక్స్) దూకుడుగా హిట్టింగ్ చేశాడు. వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో ఢిల్లీ ఆరు ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ దాటింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 21 పరుగులు) ఉన్నంతలో వేగంగా ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా రాహుల్ అదే జోరుతో ఆడాడు. ఈ క్రమంలో 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేరుకున్నాడు చివరి 30 బంతుల్లో 43 పరుగులే ఇచ్చి ఢిల్లీ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా, మతీష పతిరణ, నూర్ అహ్మద్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

పోరాటమే లేకుండా

184 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 158/5 స్కోరు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ (54 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, ఓ సిక్సర్) స్లో హాఫ్ సెంచరీ పనికిరాకుండా పోయింది. ధోని (26 బంతుల్లో 30 నాటౌట్) మెరుపులు మిస్సయ్యాయి. ఢిల్లీ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రచిన్ రవీంద్ర (3)ను రిటర్న్ క్యాచ్ తో ముకేశ్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే కెప్టెన్ రుతురాజ్ (5)ను స్టార్క్ ఔట్ చేసి చెన్నైని చావుదెబ్బ కొట్టాడు. ఢిల్లీ ఆటగాడు విప్రజ్ నిగమ్ మరోసారి బాల్ లో అదరగొట్టాడు.

Tags

Next Story