Chess World Cup: ఔరా... ప్రజ్ఞానంద

Chess World Cup: ఔరా... ప్రజ్ఞానంద
చరిత్ర సృష్టించిన భారత చెస్‌ సంచలనం.... ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన ప్రజ్ఞానంద.... రెండో భారత ఆటగాడిగా రికార్డు...

భారత యువ చెస్‌ సంచలనం ప్రజ్ఞానంద(Ramesh Babu Pragnananda) చరిత్ర సృష్టించాడు. దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌(Chess World Cup) ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రతిష్టాత్మక ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లి నవ చరిత్ర లిఖించాడు. ఆసక్తికరంగా సాగిన సెమీ ఫైనల్లో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో ప్రపంచ మూడో నంబర్‌ ప్లేయర్‌ ఫాబియానో కరునపై ఈ యువ గ్రాండ్ మాస్టర్‌(Pragnananda) సంచలన విజయం సాధించాడు. ఇద్దరి మధ్య రెండు క్లాసిక్‌ గేములు 1-1తో డ్రా కావడంతో విజేతను నిర్ణయించేందుకు టై బ్రేక్‌ అనివార్యమైంది. తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఫాబియానోను కట్టడి చేయడంలో ప్రజ్ఞానంద పూర్తిగా సఫలమయ్యాడు. ఏ దశలోనూ పుంజుకునేందుకు అవకాశమివ్వకుండా పదునైన వ్యూహాలతో ఎత్తుకు పైఎత్తు వేస్తూ అమెరికా గ్రాండ్‌ మాస్టర్‌ కరునను ఓడించాడు. తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 71 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత గేమ్‌లో తెల్లపావులతో ఆడి 53 ఎత్తుల్లో ప్రత్యర్థిని నిలువరించాడు. రెండు గేములు డ్రా కావడంతో ర్యాపిడ్‌లో రెండో రౌండ్‌కు తెరలేచింది. తొలి గేమ్‌లో తెల్లపావులతో ప్రజ్ఞానంద కరువానా నుంచి గట్టి సవాలును దాటుకుని 63 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఈ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రజ్ఞానంద.. ఆ తర్వాత రసవత్తరంగా సాగిన గేమ్‌ను 82 ఎత్తుల్లో డ్రా చేసుకుని ముందంజ వేశాడు. ఓవరాల్‌గా సెమీస్‌లో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో కరువానాపై నెగ్గాడు.


ఇక ఇప్పటికే ఫైనల్‌ చేరుకున్న ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌(Magnus Carlson)తో టైటిల్‌ పోరులో ప్రజ్ఞానంద అమీతుమీ తేల్చుకోనున్నాడు. రెండు, మూడు స్థానాల కోసం ఫాబియానో, అబసోవ్‌ మధ్య పోరు జరుగనుంది. మెగాటోర్నీలో ఫైనల్‌ చేరిన ప్రజ్ఙానందను చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించాడు.


మెగాటోర్నీలో టాప్‌-3లో నిలువడం ద్వారా వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్‌ టోర్నీకి ప్రజ్ఞానంద ఇప్పటికే అర్హత సాధించాడు. క్యాండిడేట్‌ టోర్నీకి అర్హత సాధించిన మూడో అతిపిన్న వయస్కునిగా 18 ఏళ్ల ప్రజ్ఞానంద నిలిచాడు. బాబి ఫిషర్‌, కార్ల్‌సన్‌ తర్వాత ఆ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు. 2005లో ప్రపంచకప్‌లో నాకౌట్‌ ఫార్మాట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్‌ చేరిన తొలి భారత ఆటగాడు ప్రజ్ఞానందే. కార్ల్‌సన్‌తో టైటిల్‌ పోరులో భాగంగా నేడు తొలి గేమ్‌ జరుగుతుంది.

మహిళల విజేత గోర్యాచ్కినా

మహిళల విభాగంలో రష్యా జీఎం అలెగ్జాండ్రా గోర్యాచ్కినా విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె బల్గేరియాకు చెందిన ఇంటర్నేష నల్‌ మాస్టర్‌ నుగ్యుల్‌ సలిమో వాను ఓడించి టైటిల్‌ సొంతం చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story