IOC: ఒలింపిక్స్‌లో క్రికెట్!

విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడాలన్న ప్రపంచ క్రికెట్ అభిమానుల శతాబ్దపు కల నెరవెరబోతోంది. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించాలనే ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) ఆమోదించింది. ఈ మేరకు ముంబైలో జరిగిన IOC ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగే సెషన్‌లో ఓటింగ్ జరగనుంది. క్రికెట్, బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్ క్రీడలకు ఒలింపిక్స్‌లో కొత్తగా చోటు కల్పించాలని లాస్ ఏంజెల్స్28 స్థానిక నిర్వాహక కమిటీ IOCకి సిఫారసు చేసింది. దీన్ని IOC ఆమోదించింది. టీ20 ఫార్మాట్‌లో ఆరుజట్లతో మహిళల, పురుషుల విభాగాల్లో ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు నిర్వహించాలని లాస్ఏంజెల్స్ 28 ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC ప్రజెంటేషన్ ఇచ్చింది. కటాఫ్ డేట్ నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-6 జట్లు ఒలింపిక్స్‌లో ఆడనున్నాయి. వచ్చే ఏడాది పారిస్ వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి.
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చాలన్న సిఫార్సును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంగీకరించిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. IOC ఆమోదంతో అక్టోబర్ 14 నుంచి 16 వరకు ముంబైలో జరిగే సమావేశాల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్ కేవలం లాంఛనమేనని.. కమిటీ సిఫారసుతో క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో స్థానం దక్కడం ఖాయమైందని IOC అధికారి ఒకరు తెలిపారు. మొత్తానికి కమిటీ సిఫారసు చేయడంతో ఇక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదమే మిగిలుంది. ఐఓసీ ఓకే అంటే అమెరికాలో క్రికెట్ ఆటకు రంగం సిద్ధమవుతుంది.
1900లో జరిగిన తొలిసారి ఒలింపిక్స్ లో క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. 128 సంవత్సరాల తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. 1900లో జరిగిన పారిస్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఆడించారు. ఆ ఏడాది ఫైనల్లో ఫ్రాన్స్‌పై బ్రిటన్ గెలిచింది. ఆ రోజుల్లో ప్రతి జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉండేవారు. రెండు రోజుల పాటు మ్యాచ్‌లు జరిగేవి. 2028లో అమెరికాలో జరిగే ఈ విశ్వక్రీడల కోసం నిర్వాహకులు క్రికెట్‌ను చేర్చేందుకు సిఫారసు చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి హర్షం వ్యక్తం చేసింది. లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ కమిటీ ముందు ఇప్పటికే ఐసీసీ ప్రెజంటేషన్ కూడా ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com