CRICKET: టెస్టుల్లో విరాట పర్వం ముగిసినట్లేనా..?

CRICKET: టెస్టుల్లో విరాట పర్వం ముగిసినట్లేనా..?
X
టెస్టుల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్న కోహ్లీ

రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు ఆవేదనలో ఉన్నాయి. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ కూడా సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. విరాట్ ఈ నిర్ణయంతో రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టులో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. టెస్టులకు వీడ్కోలు పలకాలనే విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. జూన్‌ నుంచి ఇంగ్లాండ్‌ పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లనుంది. ఆలోగానే టెస్టు భవితవ్యంపై కోహ్లీ ప్రకటన చేస్తాడని సమాచారం. తన రిటైర్‌మెంట్‌ ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి కోహ్లీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోహిత్, రవీంద్ర జడేజాతో కలిసి టీ20లకు కోహ్లీ గుడ్‌బై చెప్పేశాడు. రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పిన వేళ కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఊహాగానాలు చెలరేగడం... అభిమానులను షాక్ కు గురిచేసింది.

ఇంగ్లండ్ టూర్‌కు ఉండడా...?

వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లు త్వరలో సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆ సిరీ‌స్‌లో తొలి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ ప్రదర్శన అంతగా ఏమీ లేదు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బోర్డు ఉన్నతాధికారి ఒకరు కోహ్లీని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ప్రకటించేటప్పుడు కోహ్లీ భవిష్యత్తుకు సంబంధించి సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సతమతం

2024-25 టెస్ట్ సీజన్‌లో విరాట్ కోహ్లీ తక్కువ పరుగులే చేశాడు. ఐదు మ్యాచ్‌ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాలో ఈ స్టార్ బ్యాటర్ ఫామ్ కోసం తంటాలు పడ్డాడు. ఐదు టెస్ట్‌లలో కోహ్లీ కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. పెర్త్‌లో జరిగిన సిరీస్ ఫస్ట్ టెస్ట్‌లో సెంచరీ చేసినప్పటికీ, మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో అతను 85 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తం 123 టెస్టులు ఆడిన కోహ్లీ 30 సెంచరీలతో సహా 9,230 పరుగులు చేశాడు.

కెప్టెన్‌గానూ...

2014 చివరలో విరాట్ కోహ్లీ భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ భారత కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2022 ప్రారంభంలో విరాట్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత బీసీసీఐ ఆ బాధ్యతను రోహిత్ శర్మకు అప్పగించింది. విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయితే టీమిండియాకు ఇంగ్లాండ్‌లో ఉన్న అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్ల గైడెన్స్ లభించదు.

కోహ్లీ టెస్ట్ కెరీర్ ఇలా...

36 ఏళ్ల విరాట్ కోహ్లీ భారత్ తరఫున 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. విరాట్ కోహ్లీ 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. గత ఐదేళ్లలో విరాట్ కోహ్లీ సగటు పడిపోయింది. ఈ కాలంలో విరాట్ కోహ్లీ 37 మ్యాచ్‌ల్లో 1990 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 2019 చివరి నాటికి విరాట్ టెస్ట్ సగటు దాదాపు 55గా ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో 23.75 సగటుతో పరుగులుతో చేశాడు. ఆ పర్యటనలో విరాట్ కోహ్లీ 8 సార్లు ఔట్ అయ్యాడు. వాటిలో 7 సార్లు ఆఫ్ స్టంప్ వెలుపలే ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టెస్టుల నుంచి కూడా కోహ్లీ తప్పుకుంటే భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story