OLYMPICS: ఒలింపిక్స్‌లో క్రికెట్!

క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఒలింపిక్స్లో క్రికెట్ను చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. 2028 లాజ్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. అక్టోబరు 15 నుంచి 17 వరకు ముంబయిలో జరిగే సదస్సులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) దీనిపై నిర్ణయం తీసుకోనుంది. చాలాకాలం నుంచి వస్తున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రతిపాదనలకు ఈసారి కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2028 ఒలింపిక్స్‌లో స్థానం కోసం పోటీ పడుతున్న తొమ్మిది క్రీడలలో క్రికెట్‌గా కూడా ఉంది. ఇప్పటికే ఇది మిగిలిన క్రీడల కంటే అన్ని రకాలుగా క్రికెట్ ముందంజలో ఉంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తన అభిమానుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే క్రికెట్‌ను పరిగణలోకి తీసుకోవాలని చూస్తోంది.
2028లో ఒలింపిక్స్‌లో చేర్చాలని పరిశీలిస్తున్న తొమ్మిది క్రీడల్లో క్రికెట్ అన్నింటికంటే ముందున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌కు ఉన్న భారీ ఫ్యాన్‌బేస్‌ను తమ వైపు తిప్పుకొనే విషయాన్ని ఒలింపిక్స్ కమిటీ తీవ్రంగా పరిశీలిస్తోంది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించే ఒలింపిక్స్ కోసం ముంబయిలో దాదాపు 100 మంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ నెల 8వ తేదీన స్విట్జర్లాండ్‌లోని లౌసన్నేలో ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుల భేటీలోనే దాదాపు ఓ తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి.
క్రికెట్‌తోపాటు ఒలింపిక్స్‌లో స్థానం కోసం పోటీపడుతున్న క్రీడల్లో ఫ్లాగ్ ఫుట్‌బాల్, కరాటే, కిక్‌బాక్సింగ్, బేస్‌బాల్-సాఫ్ట్‌బాల్, లాక్రోస్, బ్రేక్ డ్యాన్సింగ్, స్క్వాష్, మోటార్ స్పోర్ట్ ఉన్నాయి. ఒలింపిక్స్‌లో కొత్త క్రీడల చేరికపై ఐవోసీ మాజీ మార్కెటింగ్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ డైరెక్టర్ మిచెల్ పేన్ మాట్లాడుతూ.. పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తే క్రికెట్ ఒలింపిక్స్‌లో చేరడం దాదాపు ఖాయమని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో క్రికెట్ అభిమానుల సంఖ్య పెరుగుతోందని ఆయన గుర్తు చేశారు.
ఒలింపిక్స్ చరిత్రలో 1900లో ఒక్కసారి మాత్రమే క్రికెట్ను చేర్చారు. పారిస్లో జరిగిన ఒలింపిక్స్‌లో క్రికెట్ ఈవెంట్లో గ్రేట్ బ్రిటన్, ఆతిథ్య ఫ్రాన్స్ మాత్రమే పాల్గొన్నాయి. టెస్టు ఫార్మాట్లో జరిగిన ఈ మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్ 158 పరుగుల తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో గ్రేట్ బ్రిటన్ 117 పరుగులకు ఆలౌట్ కాగా..ఆ తర్వాత ఫ్రాన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 78 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో గ్రేట్ బ్రిటన్ 5 వికెట్లకు 145 పరుగులు చేసి డిక్లెర్డ్ చేసింది. 185 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఫ్రాన్స్ 26 పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కనిపించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com