Bumrah: తండ్రి అయిన జస్ప్రీత్ బుమ్రా

Bumrah: తండ్రి అయిన జస్ప్రీత్ బుమ్రా
X
తమ హృదయాలు నిండుదనాన్ని సంతరించుకున్నాయంటూ ట్విట్టర్ లో పోస్ట్

టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తండ్రయ్యాడు. ఆయన భార్య సంజనా గణేశన్‌ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఓ ఫొటో షేర్‌ చేశాడు.చిన్నారికి అంగద్‌ జస్ప్రీత్‌ బుమ్రాగా నామకరణం చేసినట్టు వెల్లడించాడు.తన చిన్న కుటుంబం పెరిగిందిని....తమ హృదయాలు సంతోషంతో నిండిపోయాయని తెలిపాడు.ఇప్పుడు తమ ఆనందానికి అవధుల్లేవని... తల్లిదండ్రులుగా తమ జీవితాల్లో ప్రారంభమైన కొత్త అధ్యాయాన్ని ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నట్టు బుమ్రా ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. తమ కుమారుడి చేతి పక్కనే బుమ్రా దంపతులు చేతులు ఉంచి తీసిన ఫొటోను పంచుకున్నాడు.దీంతో బుమ్రా దంపతులకు తోటి క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంకలో ఉన్న బుమ్రా భార్య ప్రసవం కారణంగానే ఉన్నపళంగా ఆదివారం భారత్‌కు తిరిగొచ్చాడు. దీంతో బుమ్రా సోమవారం నేపాల్‌తో టీమిండియా ఆడే మ్యాచ్‌కు దూరం అయ్యాడు. టీమిండియా సూపర్ 4లో అడుగుపెడితే బుమ్రా మళ్లీ జట్టులో చేరతాడు. కాగా వెన్ను నొప్పి కారణంగా దాదాపు ఏడాదిపాటు జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఐర్లాండ్ పర్యటనతో రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో ఆడిన మొదటి సిరీస్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ బ్యాటింగ్‌లో జట్టుకు విలువైన పరుగులు జోడించాడు.


ఇక బుమ్రా భార్య సంజన గణేశన్ 1991 మే6న జన్మించారు. ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరింది. 2012లో ఆమె ఫెమినా స్టైల్ దివా పోటీలో పాల్గొని ఫైనల్‌కు చేరుకుంది. ఇండియాలో స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా, మోడల్‌గా కూడా రాణించింది.ఇక, జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్‌ల తొలి పరిచయం 2013లో జరిగింది. 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో బుమ్రాను సంజన ఇంటర్వ్యూ చేసిన సమయంలో వారు మొదటిసారి కలుసుకున్నారు. తర్వాత వారు స్నేహితులుగా మారారు. సంజనా 'ఫెమినా అఫీషియల్‌గా గార్జియస్' అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇక, 2014లో సన్నీ లియోన్, నిఖిల్ చినపా హోస్ట్ చేసిన ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా సీజన్ 7లో పాల్గొన్నారు. ఆ తర్వాత జస్పీత్ బుమ్రా-సంజన గణేశన్‌ల మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ‘నమన్‌’ అనే అవార్డు షో సందర్భంగా వీరిద్దరూ మరింత దగ్గరయ్యారు. పెళ్లికి ముందు వీరు కొన్నేళ్లు డేటింగ్‌లో ఉన్నారు. అయితే చాలాకాలం పాటు వారి ప్రేమ బంధం గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇక, చివరకు జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్‌లు 2021 మార్చి 15న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Tags

Next Story