IPL: హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి

ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్... పూర్తి ఓవర్లు కూడా ఆడకుండా ఆలౌట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పరాజయం పాలైంది. విశాఖలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేయాలన్న హైదరాబాద్ నిర్ణయం బెడిసి కొట్టింది. 18.3 ఓవర్లలోనే కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. యువ బ్యాటర్ అనికేత్ వర్మ (74) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ మెరుపు ఫిఫ్టీ (27 బంతుల్లో 50, 3 ఫోర్లు, 3 సిక్సరలు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో జిషాన్ అన్సారీ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ విజయంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది.
కొత్త హీరో అనికేత్
ఈ మ్యాచులోనూ దూకుడు మంత్రాన్ని అవలంభించాలని భావించిన హైదరాబాద్ నిర్ణయం కొంపముంచింది. బ్యాటింగ్ అనుకూలించిన పిచ్‌పై తెలివిగా ఆడిన అనికేత్ వర్మ.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌ను పేసర్ స్టార్క్ వణికించాడు. అభిషేక్ తొలి ఓవర్లోనే రనౌట్ అయ్యాడు. రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ (2), నితీశ్ (0)లను పెవిలియన్ చేర్చిన స్టార్క్ సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కొద్దిసేపటికే హెడ్‌ను కూడా స్టార్క్ క్యాచవుట్ చేయడంతో పవర్ ప్లేలో హైదరాబాద్ 58/4తో తీవ్ర ఇక్కట్లలో పడింది. ఈ దశలో అనికేత్, క్లాసెన్ ఐదో వికెట్‌కు 42 బంతుల్లో 77 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. ఢిల్లీ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్న అనికేత్ భారీ షాట్లతో అలరించాడు. క్లాసెన్ దూకుడుకు మోహిత్ చెక్ పెట్టగా, అభినవ్ (4), కమిన్స్ (2)లను పెవిలియన్ చేర్చిన కుల్దీప్ ఆపై అనికేత్‌నూ అవుట్ చేశాడు. తొలుత సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. అనికేత్ వర్మ (41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74) హాఫ్ సెంచరీతో చెలరేగగా, క్లాసెన్ (32), హెడ్ (22) రాణించారు.
ఫాఫ్ దూకుడుతో..
కష్టతరంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ సునాయసంగా గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. డుప్లెసిస్, జాక్ ఫ్రేసర్ మెక్ గర్క్ (38) భారీ షాట్లు ఆడారు. ఢిల్లీ ఓపెనర్లు 55 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న జీషాన్ అన్సారీ.. మెక్ గర్క్ ని ఔట్ చేసి, తొలి వికెట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ (34 నాటౌట్) తో కలిసి డుప్లెసిస్ ధాటిగా ఆడాడు. ఫాఫ్ డుప్లెసిస్ 26 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ (15) వేగంగా ఆడబోయి ఔటయ్యాడు. స్టబ్స్ (21 నాటౌట్) తో కలిసి పోరెల్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఢిల్లీ విజయం సాధించింది. స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com