Anand Mahindra: "చెస్ ప్రజ్ఞ"కు అదిరిపోయే గిఫ్ట్

ఫిడే ప్రపంచకప్ చెస్ టోర్నీ(FIDE Chess World cup)లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద (Praggnanandhaa) పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది. 18 ఏళ్ల విశ్వవేదికపై భారత మేధస్సుకు ప్రతీకగా నిలిచిన ప్రగ్ ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంది. ప్రజ్ఞానంద ప్రతిభకు ముగ్దుడైన పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) అతడి కుటుంబానికి అదిరిపోయే బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ప్రజ్ఞానందను ప్రపంచ చెస్ మేధావిగా తీర్చిదిద్దిన అతడి తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇస్తానని ఆనంద్ మహీంద్ర ప్రకటించారు. పిల్లలకు చెస్‌పై ఆసక్తి పెంచేలా పేరేంట్స్ అందరూ ప్రోత్సహించాలని.. విద్యుత్ వాహనాల మాదిరిగానే ఇది కూడా పిల్లల భవిష్యత్‌కు మంచి పెట్టుబడి అని పేర్కొన్నారు.
ప్రపంచకప్ చెస్ టోర్నీలో నెంబర్ వన్ ఆటగాడు కార్ల్‌సన్‌కు గట్టి పోటీనిచ్చి అందరి మనసులు గెల్చుకున్న ప్రజ్ఞానంద (Praggnanandhaa)పై ఆనంద్ మహీంద్ర ఇప్పటికే ప్రశంసల జల్లు కురిపించారు. రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద (Praggnanandhaa)ను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఎక్స్(twitter)లో పోస్ట్ పెట్టారు. దీనికి పలువురు నెటిజన్లు స్పందిస్తూ ప్రజ్ఞానందకు కారును బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ ట్వీట్లకు స్పందించిన ఆనంద్ మహీంద్రా స్పందించారు.
ప్రజ్ఞానందకు కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారని కానీ తన దగ్గర వేరే ఆలోచన ఉందని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చెస్ ఆటను పరిచయం చేయాలని.. వారికి ఆ గేమ్‌పై ఆసక్తిని పెంచేలా వారిని ప్రోత్సహించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అందువల్ల, ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మీ, రమేశ్ బాబుకు తాను XUV400 ఈవీని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాని ట్వీట్ చేశారు. కుమారుడి అభిరుచిని ప్రోత్సహించి.. ఆ రంగంలో అతడు ఎదిగేలా నిరంతర మద్దతునిచ్చిన ఆ తల్లిదండ్రులు ఈ కానుకకు పూర్తి అర్హులని (Deserve Our Gratitude) ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పోస్ట్ చేశారు.
ఈ ఆలోచనకు తన అభిప్రాయం కూడా తెలపాలంటూ మహీంద్రా అండ్ మహీంద్రా సీఈఓ(Executive Director and CEO), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజురికర్(Rajesh Jejurikar )ను ఆనంద్ మహీంద్రా ట్యాగ్ చేశారు. దీనికి రాజేశ్ బదులిస్తూ.. అద్భుతమైన విజయాలు సాధిస్తున్న ప్రజ్ఞానందకు అభినందనలు. అతడి తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని గుర్తించి.. వారికి కానుకను ప్రకటించినందుకు ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు. XUV400 ప్రత్యేక ఎడిషన్ ఈవీని అతడి తల్లిదండ్రులకు డెలివరీ చేస్తామని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మహీంద్రాను కొనియాడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com