KARUNARATNE: స్టార్ ఆటగాడి అనూహ్య వీడ్కోలు

శ్రీలంక స్టార్ ఆటగాడు దిముత్ కరుణరత్నె అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో గాలేలో జరుగనున్న రెండో టెస్టే తనకు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అని కరుణరత్నె తెలిపాడు. ఈ మ్యాచ్ కరుణరత్నేకు100వ టెస్ట్‌గా, క్రికెట్‌లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుంది. కరుణరత్నే తన చివరి ఏడు టెస్టుల్లో 182 పరుగులు మాత్రమే చేశాడు. దేశీయ క్రికెట్‌లో కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. దీంతో.. యంగ్ ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కరుణరత్నె క్రికెట్ నుంచి తప్పుకోవడం శ్రీలంక జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అని అభిమానులు అంటున్నారు. అకస్మాతుగా రిటైర్మెంట్ ప్రకటించడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కుమార సంగక్కర, మహేళ జయవర్దనే, సనత్ జయసూర్య వంటి దిగ్గజాలు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత శ్రీలంక జట్టుకు మూల స్తంభంలా కరుణరత్నే నిలబడి పోయాడు.
ఇలా అరంగేట్రం...
2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిముత్ కరుణరత్నే తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లోని మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సున్నా, రెండో ఇన్నింగ్స్‌లో 60 నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఆడిన 99 టెస్ట్ మ్యాచ్‌ల్లో కరుణరత్నే 16 టెస్ట్ సెంచరీలతో మొత్తం 7,172 పరుగులు సాధించాడు. 2021లో అతను బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. టెస్ట్‌లో అతని అత్యధిక స్కోరు 244. " మాథ్యూస్, దినేష్ చాందిమల్‌తో కూడా మాట్లాడా. ముగ్గురం ఒకేసారి రిటైరయ్యే బదులు.. ఒక్కొక్కరుగా వీడ్కోలు పలికితే మంచిదని భావించాం" అని చెప్పాడు.
నాలుగో స్థానంలో
శ్రీలంక తరపున 50 వన్డేలు, 34 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. శ్రీలంక తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కరుణరత్నే నాల్గవ స్థానంలో ఉంటాడు. అతని కంటే ముందు కుమార్ సంగక్కర (12400), మహేల జయవర్ధనే (11814), ఏంజెలో మాథ్యూస్ (8090) ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com