DITWA: తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను.. తీవ్ర వాయుగుండంగా మారింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలవైపు సమాంతరంగా కదులుతోంది. మధ్యాహ్నం నాటికి ఇది వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు.
నేడు అతి భారీ వర్షాలు
'దిత్వా' తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, గుంటూరు, కడప, కోనసీమ, ఏలూరు, పల్నాడు, బాపట్ల, NTR, కృష్ణా, అన్నమయ్య, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఈ క్రమంలో తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు అధికారులు సెలవులిచ్చారు.
తిరుమలలో భారీ వర్షాలు
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. దిత్వా తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీవారి సన్నిధిలోని దర్శనీయ ప్రదేశాలు పాప వినాశనం, శ్రీవారి పాదాలకు మార్గాలు తాత్కాలికంగా మూసివేసింది. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాలకు అలిపిరి వద్ద హెచ్చరికలు జారీ చేస్తూ ట్రాఫిక్ జామ్‌ను క్రమబద్ధీకరిస్తోంది. భక్తులు జాగ్రత్తలు పాటించాలని ఏపీ ప్రభుత్వం, టీటీడీ సూచించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

