Wimbledon: ప్రేక్షకుల నోరు మూయించిన జకోవిచ్ కూతురు..!

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో వరల్డ్ నంబర్ 2 ఆటగాడు, రెండవ సీడ్, సెర్బియన్ ఆటగాడు జకోవిచ్ తొలి రౌండ్‌లో సులువుగానే విజయం సాధించాడు. అర్జెంటీనా ఆటగాడు పెడ్రో కాచిన్‌ని 6-3, 6-3, 7-6(4)తో ఓడించి రెండవ రౌండ్‌లో ప్రవేశించాడు. ఈ విజయంతో వింబుల్డన్‌లో వరుసగా 18 సార్లు మొదటి రౌండ్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. వింబుల్డన్ టోర్నీలో జకోవిచ్‌కి ఇది 29వ వరుస విజయం. 2017 సంవత్సరం నుంచి ఒక్క వింబుల్డన్ మ్యాచ్ కూడా అతను ఓడిపోలేదు. గత 5 సంవత్సరాలుగా వింబుల్డన్ విజేత జకోవిచే.
అయితే తొలి మ్యాచ్‌లో అందరినీ ఆకట్టున్నది మాత్రం జకోవిచ్ కూతురు తారానే. 5 సంవత్సరాల తారా, తల్లి జెలెనాతో కలిసి తండ్రి జకోవిచ్ మ్యాచ్‌ని వీక్షించింది. మ్యాచ్‌లో తండ్రి జకోవిచ్ చేసిన సర్వ్ విఫలమై నెట్‌ని తాకింది. ప్రేక్షకుల అసంతృప్తిని గమనించిన తారా ప్రేక్షకుల వైపు చూస్తూ తన పెదాలపై వేలి పెట్టి "ష్..ష్..." అంటూ బిగ్గరగా, చాలా సేపు సైగలు చేసి అలరించింది. జెలెనాని 2014లో జకోవిచ్ పెళ్లి చేసుకున్నాడు.
మ్యాచ్‌లో తొలి సెట్ జరుగుతుండగా వర్షం అడ్డంకిగా మారింది. దీంతో 90 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది. ప్రేక్షకులను ఎప్పుడూ తన వ్యక్తిత్వం, ప్రవర్తనతో అలరించే జకోవిచ్ ఇప్పుడు కూడా తడిసిన కోర్టును తన టవల్‌తో ఆర్పుతూ ఆలరించాడు. అలాగే గ్రౌండ్ ఆరడానికి తమవంతుగా నోటితో ఊదుతూ సాయం చేయాలని కోరి అభిమానుల్ని ఉల్లాసపరచడానికి ప్రయత్నించాడు.
మ్యాచ్ అనంతరం జకోవిచ్ మాట్లాడుతూ... వింబుల్డన్‌కు వచ్చి గెలవడం నాకు ఎప్పుడూ ఒక కల. 2011లో నా చిన్ననాటి కల నిజమైంది. ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తూ ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సెర్బియాలో కలలుగన్న నేను చిన్నతనంతో నేను కనెక్ట్ అవుతున్నానని వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com