Djokovic: టెన్నీస్‌ ప్రపంచంలో జకోవిచ్‌ యుగం

Djokovic: టెన్నీస్‌ ప్రపంచంలో జకోవిచ్‌ యుగం
X
సిన్సినాటీ ఓపెన్‌ కైవసంతో మరో రికార్డు... ATP మాస్టర్స్ 1000 టైటిల్స్ రికార్డును 39కి పెంచుకున్న జకోవిచ్‌

టెన్నీస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.వెస్ట్రన్ అండ్‌ సదరన్ ఓపెన్‌లో హోరాహోరీ పోరులో కార్లోస్‌ అల్కరాజ్‌ను జకోవిచ్‌ మట్టికరిపించాడు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5-7, 7-6 (7), 7-6 (4) తేడాతో జకోవిచ్‌ విజయం సాధించి టైటిల్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. 3 గంటల 49 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌ ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. రోజర్ ఫెడరర్-మార్డీ ఫిష్‌ మధ్య 2010లో జరిగిన 2 గంటల 49 నిమిషాల సిన్సినాటి రికార్డు ఈ మ్యాచ్‌తో బద్దలైంది. ప్రపంచ నెంబర్‌ వన్‌ అల్కరాజ్‌.. నెంబర్‌ టూ జొకోవిచ్ మధ్య మ్యాచ్‌.. అంచనాలను అందుకునేలా సాగింది. ఇద్దరు ఆటగాళ్లు కోర్టులో కొదమసింహాల్లా తలపడ్డారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తలపడిన జకోవిచ్‌... సిన్సినాటి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

ఈ విజయంతో జకోవిచ్‌ బిగ్‌ టైటిల్స్‌ రేసులో తన ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. ATP మాస్టర్స్ 1000 టైటిల్స్ రికార్డును 39కి పెంచుకున్నాడు. 36 ఏళ్ల జకోవిచ్‌ ఇప్పుడు 68 'బిగ్ టైటిల్స్' తో ATP మాస్టర్స్ 1000 టైటిల్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌షిప్‌లు, ATP ఫైనల్స్‌ ట్రోఫీలు, ATP మాస్టర్స్ 1000 టోర్నమెంట్‌లు, ఒలింపిక్ సింగిల్స్ బంగారు పతకాలు ఉన్నాయి.

జొకోవిచ్ ఆడిన ప్రతి 3.2 టోర్నమెంట్‌లకు ఒక బిగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు . ATP మాస్టర్స్ 1000 టైటిల్స్‌లో రెండో స్థానంలో ఉన్న రఫేల్ నాదల్‌ కంటే ఇది ఎక్కువ. నాదల్‌ ప్రతీ 305 టోర్నీలకు ఒక పెద్ద ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. నాదల్‌ కంటే జకోవిచ్‌ తొమ్మిది ట్రోఫీలు ఎక్కువ సాధించాడు. గత సంవత్సరం లేవర్ కప్‌లో రిటైర్డ్ అయిన రోజర్ ఫెదరర్ ప్రతి 4.4 ఈవెంట్‌లకు ఒక బిగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

సిన్సినాటి విజయంతో మొత్తం తొమ్మిది ATP మాస్టర్స్ 1000 టోర్నమెంట్‌లను గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా కూడా జకోవిచ్‌ రికార్టు సృష్టించాడు. జకోవిచ్ ఇప్పుడు నాదల్ కంటే మూడు మాస్టర్స్ 1000 టైటిళ్లను ఎక్కువగా సాధించాడు. 1990లో ATP మాస్టర్స్ 1000 సిరీస్‌ను ప్రారంభించినప్పటి నుంచి కనీసం 30 సార్లు అగ్రస్థానంలో నిలిచిన ఇద్దరు ఆటగాళ్లుగా జకోవిచ్‌, నాదల్‌ రికార్డు సృష్టించారు.

Tags

Next Story