SA: 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర

1998 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత సౌతాఫ్రికా గెలిచిన మరో ఐసీసీ టైటిల్ ఇదే కావడం విశేషం. క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికాకు ఇది రెండో ఐసీసీ టైటిల్ మాత్రమే. ప్రతీ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో నాకౌట్ చేరడం.. కీలక మ్యాచ్‌లో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించడం సౌతాఫ్రికాకు అలవాటుగా మారింది. ఒకటా రెండా.. వన్డే ప్రపంచకప్‌లో 7 సార్లు.. టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు సార్లు సౌతాఫ్రికా ఖంగుతింది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లోనూ భారత్ చేతిలో సౌతాఫ్రికాకు నిరాశే ఎదురైంది. ఈ సారి మాత్రం ఆ తప్పు చేయకుండా సఫారీ టీమ్ టైటిల్‌ను ఒడిసిపట్టుకుంది. తమపై ఉన్న చోకర్స్ అనే ముద్రను చెరపేసుకుంది. ఈ ఫలితంతో డబ్ల్యూటీసీలో కొత్త ఛాంపియన్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. తొలి ఫైనల్‌లో న్యూజిలాండ్, రెండోసారి ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచాయి.
శతకంతో గెలిపించిన మార్క్‌రమ్ మామ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. స్మిత్(66), బ్యూ వెబ్‌స్టర్(72) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రబడా(5/51) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ బెడింగ్‌హమ్(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్యాట్ కమిన్స్(6/28) సఫారీ పతనాన్ని శాసించింది. 74 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 207 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్(58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. కగిసో రబడా(4/59) నాలుగు వికెట్లు తీసాడు. 282 పరుగుల లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. మార్క్‌మర్ సెంచరీ, టెంబా బవుమా హాఫ్ సెంచరీతో లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా ఆటగాళ్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్‌వుడ్ చెరో వికెట్ పడగొట్టారు. కెప్టెన్ బవుమా, బెడింగ్‌హమ్ విలువైన ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికా చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com