Ashes Series: ఇంగ్లాండ్‌ని గెలిపించిన హ్యారీ బ్రూక్, యాషెస్ ఆశలు సజీవం

ఎట్టకేలకు ఇంగ్లాండ్ గెలిచింది. యాషెస్ టెస్ట్ సిరీస్‌లో 3వ టెస్ట్‌లో గెలిచి యాషెస్ ట్రోఫీ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లు రాణించడంతో 4వ రోజు విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ 93 బంతుల్లో 75(4x9) పరుగులు చేసి విజయానికి బాటలు పరిచాడు. క్రిస్ ఓక్స్(32) బ్రూక్‌కి చక్కటి సహకారం అందించాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-1 తేడాతో ఆసీస్ ముందంజలో ఉంది. 100వ టెస్ట్ ఆడిన స్టీవ్ స్మిత్‌కి నిరాశే మిగిలింది.
పేస్‌కు అనుకూలిస్తున్న లీడ్స్ పిచ్‌పై 4వ రోజు 27 పరుగులతో 251 పరుగుల లక్ష్య ఛేదనతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్‌ని 9వ ఓవర్లో బెన్ డకెట్(23) పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. అందరినీ ఆశ్యర్యపరుస్తూ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ క్రీజులోకి వచ్చాడు. ఇంకా కుదురుకోని అలీ(5)ని మళ్లీ స్టార్క్ బౌల్డ్ చేసి వెనక్కి పంపాడు. బౌండరీలు, సింగిల్స్ తీస్తూ కుదురుకున్నట్లుగా అన్పించిన ఓపెనర్ క్రాలే(44) మిషెల్ మార్ష్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా మళ్లీ పోటీలోకి వచ్చింది. క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ బౌండరీల మీద బౌండరీలు కొడుతూ లక్ష్యాన్ని తగ్గిస్తూ వచ్చాడు. మరో ఎండ్‌లో ఉన్న జో రూట్(21) మాత్రం ఆచితూచి ఆడాడు. లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని ఆడబోయి కమిన్స్ బౌలింగ్‌లో కీపర్‌కి చిక్కాడు. క్రీజులోకి రాగానే కెప్టెన్ బెన్‌స్టోక్స్(13) బౌండరీతో ఖాతా తెరిచాడు. లంచ్ ముగిసే సమయానికి 4 వికెట్లకు ఇంగ్లాండ్ 153 పరుగులు చేయగా, విజయానికి 98 పరుగులు అవసరమయ్యాయి. ధాటిగా ఆడే క్రమంలో బెన్‌స్టోక్స్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం వచ్చిన కీపర్ బెయిర్‌స్టో(5) కూడా అలా వచ్చి ఔటై వెంటనే దిరిగాడు. అప్పటికీ ఇంగ్లాండ్ విజయానికి 80 పరుగులు కావాలి. మళ్లీ లార్డ్స్ ఫలితం తప్పదా అనిపించింది.
ఓ వైపు వికెట్లు పడుతున్నా అవతలి ఎండ్‌లో క్రిస్ ఓక్స్‌తో కలిసి ఆడుతూ 67 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. ధాటిగా ఆడేక్రమంలో స్టార్క్ బౌలింగ్‌లో షాట్ సరిగ్గా తగలక బంతి గాల్లో లేవడంతో కమిన్స్ ఒడిసి పట్టాడు. వీరిద్దరూ కలిసి 50 పరుగులు జోడించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో స్టార్క్ 5వ వికెట్ల మార్క్ మరోసారి అందుకున్నాడు. విజయానికి 21 పరుగులు చేయాల్సి ఉండగా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఔటవ్వడంతో ఛేదన భారం వోక్స్‌పై పడింది. ఇంగ్లాండ్ ఆటగాడు మార్క్ వుడ్(24) తను ఎదుర్కొన్న రెండో బంతిని సిక్స్‌కి తరలించడంతో ఇంగ్లాండ్‌పై ఒత్తిడి తగ్గింది. మరుసటి ఓవర్లోనే మళ్లీ బౌండరీకి తరలించడంతో ఇంగ్లాండ్ విజయానికి 2 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాలని ఫీల్డర్లందరూ సర్కిల్‌లో మోహరించడంతో క్రిస్ వోక్స్ బంతిని బౌండరీకి తరలించి ఇంగ్లాండ్‌ని సంబరాల్లో ముంచాడు. మార్క్‌వుడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
సిరీస్‌లో 4వ టెస్ట్ జులై 19న మాంచెస్టర్‌లో జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com