IPL తరహాలో గ్లోబల్ చెస్ లీగ్..

జూన్ 22 నుంచి జూలై 2 వరకు, గ్లోబల్ చెస్ లీగ్ మొదటి ఎడిషన్ దుబాయ్‌లో జరగనుంది. 2021లో ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ కోసం జరిగిన మ్యాచ్ తర్వాత దుబాయ్‌లో జరిగే రెండవ అత్యంత ముఖ్యమైన చెస్ ఈవెంట్ ఇదే.
మొదటి మ్యాచ్ జూన్ 22న సాయంత్రం 5:30 PM GST (7:00 PM IST)కి టోర్నమెంట్ వేదికైన మెరిడియన్ హోటల్‌లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, ముంబా మాస్టర్స్ మధ్య జరుగుతుంది. ఈ పోటీల్లో ప్రస్తుత, మాజీ ప్రపంచ ఛాంపియన్‌లు హోరాహోరీగా పోటీ పడనున్నారు. చెస్‌లో తొలిసారిగా, జట్టు సభ్యులందరూ ఒకే రంగు ముక్కలతో గేమ్ ఆడనున్నారు. జూలై 2న ఫైనల్స్ జరగనున్నాయి.
లీగ్ ఫార్మాట్ ఇదే...
ఈ ఈవెంట్‌లో ఆరుగురు ఆటగాళ్లతో కూడిన 6 జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టులో ఒక ఐకాన్ ప్లేయర్, ఇద్దరు పురుష ప్లేయర్లు, ఇద్దరు మహిళా ప్లేయర్లు, ఒక ప్రొడిజీ ప్లేయర్ (2002 ఆ తరువాత జన్మించిన వారు) ఉంటారు.
జట్లు:
- గంగా గ్రాండ్ మాస్టర్స్
- త్రివేణి కాంటినెంటల్ కింగ్స్
- SG ఆల్పైన్ వారియర్స్
- చింగారి గల్ఫ్ టైటాన్స్
- ముంబా మాస్టర్స్
- బాలన్ అలాస్కాన్ నైట్స్
గ్లోబల్ చెస్ లీగ్ ఒక ప్రత్యేకమైన ప్లేయింగ్ ఫార్మాట్‌లో రాబోతుంది. లీగ్‌లోని ప్రతి మ్యాచ్ వేర్వేరు సమయంలో జరుగుతుంది, డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్నాయి.
ఈ పోటీలు మొత్తం 3 చెస్ విభాగాలు -క్లాసికల్, ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ విభాగాల్లో జరగనున్నాయి. మొత్తం 36 మంది టాప్ ర్యాంక్ ఆటగాళ్లు టైటిల్ కోసం పోటీ పడనున్నారు. వీరిని చెస్ ఐకాన్‌లు, సూపర్‌స్టార్స్, ప్రాడిజీస్ గా వర్గీకరించారు. చెస్ ప్రపంచంలో అత్యుత్తమమైన వారు 6 వేర్వేరు జట్ల సభ్యులుగా విడిపోయి ఈవెంట్‌లో పాల్గొంటారు.
'చెస్ ఐకాన్స్'గా పేరుపొందిన ఆటగాళ్ల గ్రూప్‌లో ఛాంపియన్ ప్లేయర్, నార్వేకి చెందిన కార్ల్‌సెన్ చేరారు. ఈ గ్రూప్‌లో భారత్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్, విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ ఛాంపియన్ ఇయాన్ నెపోమ్నియాచ్చి, మాజీ బ్లిట్జ్ ప్రపంచ ఛాంపియన్ లెవాన్ అరోనియన్, మాక్సిమ్ వాచియర్-లాగ్రేవ్, 2021 చెస్ ప్రపంచ కప్ విజేత జాన్-కిర్జిస్తోఫ్ దుదా ఉన్నారు.
సూపర్‌స్టార్స్ గ్రూప్‌లో నోడిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ (2021 ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్), అలెగ్జాండర్ గ్రిష్‌చుక్ (మూడుసార్లు ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్) మరియు డానియల్ డుబోవ్ (2018 ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్), అలాగే విదిత్ గుజరాతీ, అర్జున్ ఎరిగైసి, గుకేష్ డి వంటి భారత ఆటగాళ్లు కూడా ఉన్నారు.
ఈ లీగ్‌లో ప్రముఖ మహిళా క్రీడాకారిణులు కూడా పాలుపంచుకోనున్నారు.
గ్రాండ్‌మాస్టర్ అలెగ్జాండ్రా కోస్టెనియుక్ (క్లాసికల్, ర్యాపిడ్ చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు), కాటెరినా లాగ్నో (రెండు సార్లు ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్ ఒకసారి ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్), ప్రపంచ టాప్ క్రీడాకారిణులు కోనేరు హంపీ, ద్రోణవల్లి హారిక పాల్గొననున్నారు. ఇటీవలి కాలంలో అకాడెమియాకు తన ఆటను అంకితం చేసిన నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ హౌ యిఫాన్ తిరిగిరానుండటం విశేషం.
నూతనంగా స్కోరింగ్ విధానం..
ఈ లీగ్‌లో సరికొత్త స్కోరింగ్ విధానం అమలు చేయనున్నారు. తెలుపు/నలుపు ముక్కలతో ఫలితం ఆధారంగా అందించబడిన మ్యాచ్ పాయింట్లు మరియు గేమ్ పాయింట్‌లతో కూడిన కొత్త స్కోరింగ్ సిస్టమ్ ర్యాంకింగ్ ప్రవేశపెట్టారు. తెల్లటి పావులతో గెలిచిన గేమ్ 3 గేమ్ పాయింట్లు, నలుపు ముక్కలతో గెలిచిన గేమ్‌కు 4 పాయింట్లను ఇవ్వనున్నారు. డ్రా అయితే ఇరువురికి చెరో పాయింట్ కేటాయిస్తారు.
ఒక మ్యాచ్‌లో అత్యధిక గేమ్ పాయింట్లు సాధించిన జట్టుకు అదనంగా 3 మ్యాచ్ పాయింట్లు ఇవ్వనున్నారు. అదే సమయంలో రెండు జట్లూ ఒక్కో మ్యాచ్ పాయింట్‌ను పొందుతాయి. ప్రతీ మ్యాచ్‌కు 15 నిమిషాల సమయం ఉంటుంది. అత్యధిక మ్యాచ్ పాయింట్లు సాధించిన మొదటి రెండు జట్లు జూలై 2న జరిగే ఫైనల్స్‌లో తలపడతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com