Luis Suraze: అలనాటి ఫుట్‌బాల్ లెజెండ్ లూయిస్ సురేజ్ కన్నుమూత

స్పెయిన్‌కి చెందిన దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లూయీస్ సురెజ్ కన్నుమూశాడు. 88 యేళ్ల వయసులో ఆదివారం మరణించాడు. 1950 దశకంలో సురేజ్ ఫుట్‌బాల్‌ని ఏలాడు. తన ఆటతో తాను పుట్టిన స్పెయిన్‌లోనే కాకుండా ముఖ్యంగా ఇటలీ, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
స్పెయిన్‌లోని దిగ్గజ క్లబ్ బార్సిలోనా, ఇటలీలోని ఇంటర్ మిలన్ తరఫున ఎన్నో ఘనతలు, ట్రోఫీలు సాధించాడు. స్పెయిన్‌లో జన్మించి ప్రతిష్ఠాత్మక బాలన్ డీ ఓర్ పురస్కారం పొందిన ఏకైక ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. 1935లో జన్మించిన సురెజ్ మొదట డెపొట్రివో లా కొరునా తరుపున ఆడి, 1954లో బార్సిలోనాలో చేరాడు. అక్కడ 2 లాలిగా టైటిళ్లు గెలవడంతో పాటు, బాలెన్ డీ ఓర్‌ని దక్కించుకున్నాడు. 1962లో అప్పట్లో రికార్డు స్థాయి ఫీజుతో ఇటలీ క్లబ్ ఇంటర్ మిలన్‌లో చేరాడు. ఆ జట్టు తరఫున 2 సార్లు యూరోపియన్ కప్, 3 సిరీ-ఏ టైటిళ్లు సాధించి పెట్టాడు.
అంతర్జాతీయ కెరీర్‌లో స్పెయిన్ తరఫున 34 మ్యాచులు ఆడి, 1964లో ఆ జట్టును ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిపాడు. 1973లో ఫుట్‌బాల్‌కి వీడ్కోలు పలికిన సురేజ్ తర్వాత తాను ఆడిన ఇంటర్ మిలన్‌కి కోచ్‌గా పనిచేశాడు. అనంతరం 1988లో స్పెయిన్ జట్టుకి కూడా కోచ్‌గా పనిచేసి, 2 సంవత్సరాల తర్వాత జరిగిన వరల్డ్‌కప్‌కి జట్టుని చేర్చాడు.
లూయిస్ సురేజ్ మరణం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు, క్లబ్‌లు నివాళ్లు అర్పిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com