Gary Kirsten: ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు పాక్‌‌కు ఊహించని షాక్‌..!

Gary Kirsten: ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు పాక్‌‌కు ఊహించని షాక్‌..!
X
హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన 4 నెలల‌కే పదవి నుంచి తప్పుకుంటున్న కిర్‌స్టన్

పాకిస్థాన్‌ క్రికెట్‌లో గత కొంత కాలంగా ఎప్పుడు? ఏం జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు. ఆటగాళ్లు మారిపోతుంటారు. సెలక్టర్లను మార్చేస్తుంటారు. తాజాగా కోచ్‌ విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.

ఇటీవ‌లే బాబ‌ర్ ఆజం వైట్‌బాల్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్ప‌డం, సెల‌క్ష‌న్ క‌మిటీలో మార్పులు వంటివి చోటుచేసుకున్నాయి. తాజాగా ఇప్పుడు కోచ్ గ్యారీ‌ కిర్‌స్టన్ త‌న ప‌ద‌వి నుంచి తప్పుకోనున్నట్టు తెలుస్తోంది. హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన 4 నెలల‌కే ఆయ‌న ఈ నిర్ణ‌యానికి రావ‌డం చర్చనీయాంశమైంది.

కిర్‌స్టన్ పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి రావడం, ఆపై రాజీనామా చేయడం, సెలక్షన్ కమిటీలో మార్పులు త‌దిత‌ర ఘటనలు ఆయ‌న‌ 4 నెలల పదవీకాలంలోనే జ‌రిగాయి.

గత కొన్ని వారాలుగా కోచ్‌ కిర్‌స్టన్, ఆ జ‌ట్టు ఆటగాళ్ల మధ్య కొన్ని తీవ్రమైన అభిప్రాయ భేదాలు వ‌చ్చాయ‌ని ‘క్రిక్‌బజ్’ క‌థ‌నం పేర్కొంది. అటు పీసీబీ నుంచి కూడా ఆయ‌న‌కు స‌రియైన మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేద‌ని స‌మాచారం. డేవిడ్ రీడ్‌ను హైపర్ఫార్మెన్స్ కోచ్‌గా నియమించాలని కిర్‌స్టన్ ఇటీవల బోర్డును అభ్యర్థించాడు. కానీ, ఆయ‌న అభ్య‌ర్థ‌నను పీసీబీ తిరస్కరించి, ప్రత్యామ్నాయంగా మరికొన్ని పేర్లను సూచించింది. దాంతో ఆయ‌న నిరాశ చెందార‌ని, ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని యోచిస్తున్న‌ట్టు క‌థ‌నం పేర్కొంది. ఒక‌వేళ వైట్‌బాల్‌ కోచ్ ప‌ద‌విని కిర్‌స్టన్ వ‌దులుకుంటే.. రాబోయే రోజుల్లో పీసీబీ అత‌ని వార‌సుడిగా జాసన్ గిల్లెస్పీని నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం అత‌డు పాక్ టెస్టు జ‌ట్టుకు కోచ్‌గా ఉన్నాడు.

అలాగే రాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావెద్‌ను వైట్‌బాల్‌ కోచ్‌గా నియమించే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులలో ఆకిబ్ ఒకరు. ఇటీవల స్వ‌దేశంలో ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై పాక్ 2-1తో కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌కు తెర వెనుక ఆకిబ్ కీలంగా వ్య‌వ‌హ‌రించారు.

ఇక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా ఆస్ట్రేలియా, జింబాబ్వే వైట్‌బాల్ టూర్ల కోసం జట్లను ప్రకటించింది. అయితే, ఆ రెండు ప‌ర్య‌ట‌న‌ల‌కు కిర్‌స్టన్ జట్లతో పాటుగా ఉండడని పీసీబీ వెల్ల‌డించింది. సో.. ఆ జ‌ట్టు వైట్‌బాల్ కోచ్‌గా దాదాపు గ్యారీ కిర్‌స్టన్ త‌ప్పుకున్న‌ట్టే అర్థ‌మ‌వుతోంది.


Tags

Next Story