GILL: గిల్‌కు చోటు దక్కకపోవడం వెనుక..

టీ20 వరల్డ్ కప్ 2026తో పాటు న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టు ఎంపికలో ప్రధాన చర్చనీయాంశమైన అంశం శుభ్‌మన్ గిల్‌ను పూర్తిగా జట్టుకు దూరం పెట్టడమే. ఇప్పటివరకు వైస్ కెప్టెన్‌గా కొనసాగిన గిల్‌ను ఆ బాధ్యత నుంచి తప్పించడమే కాకుండా, 15 మంది జట్టులోనూ చోటు ఇవ్వలేదు. గిల్ ఇటీవలి ఫామ్‌పై సెలెక్టర్లు అసంతృప్తిగా ఉన్నారనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది.
సెలెక్టర్ల వివరణ ఇదే
భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, గత కొంతకాలంగా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్ కు ఈ జట్టులో చోటు దక్కలేదు. దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. "గిల్ అద్భుతమైన నైపుణ్యం కలిగిన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ప్రస్తుతం అతను పరుగుల వేటలో కాస్త వెనుకబడ్డాడు. గత ప్రపంచకప్‌లోనూ విభిన్న కాంబినేషన్ల కారణంగా అతను త్రుటిలో అవకాశం కోల్పోయాడు. ఈసారి కూడా జట్టు అవసరాలు, కూర్పు దృష్ట్యా అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది" అని అగార్కర్ పేర్కొన్నారు. 15 మంది సభ్యులను ఎంపిక చేసేటప్పుడు ఎవరో ఒకరు త్యాగం చేయాల్సి ఉంటుందని, ఈసారి ఆ పరిస్థితి దురదృష్టవశాత్తూ గిల్ విషయంలో ఎదురైందని అగార్కర్ వెల్లడించారు.
గిల్ స్థానంలో ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ జట్టులోకి రాగా, అక్షర్ పటేల్ ను కొత్త వైస్ కెప్టెన్ గా నియమించారు. కేవలం ఫామ్ మాత్రమే కాకుండా, మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడం, వికెట్ కీపింగ్ ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. స్వదేశంలో జరిగే ఈ మెగా టోర్నీకి గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం.
పాండ్యా లాగే జరుగుతోందా...
ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్నాడు హార్ధిక్ పాండ్యా. పాండ్యా కెప్టెన్సీలో భారత జట్టు ఘన విజయాలు అందుకుంది. అయితే కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హార్ధిక్ పాండ్యా, వరుసగా గాయాలపాలవుతూ టీమ్‌కి దూరం అవుతున్నాడని.. అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతని ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ కూడా ఇంచుమించు ఇదే పొజిషన్లో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్‌కి టెస్టు, వన్డే కెప్టెన్సీ అప్పగించింది భారత జట్టు. టీ20ల్లో వైస్ కెప్టెన్సీ ముట్టజెప్పింది. ఇలా మూడు ఫార్మాట్లలో టీమిండియాకి ప్రాతినిథ్యం వహిస్తున్న అతి కొద్ది మంది ప్లేయర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు.. ఇలా మూడు ఫార్మాట్లలో ఇరికించడం వల్ల, ఫామ్‌లో లేకపోవడం వల్ల, వర్క్ లోడ్ పెరిగిపోవడం వల్ల శుభ్‌మన్ గిల్, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. ఇది అతని పర్ఫామెన్స్‌పైనే కాకుండా శారీరక ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ కూడా పోవడం పక్కా అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

