GST: ఐపీఎల్ అభిమానులకు జీఎస్టీ షాక్

జీఎస్టీలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం... నాలుగు స్లాబ్‌లను రెండు స్లాబ్లకు కుదించింది. ఇప్పటివరకు ఉన్న 12 శాతం, 28 శాతం స్లాబులు ఇకపై ఉండవు. లగ్జరీకి చెందినవన్నీ 40 శాతం స్లాబులోకి ప్రతిపాదించింది. రేస్ క్లబ్బులు, లీజింగ్ / రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్‌పై 40% పన్ను పడుతుంది. ఈ జాబితాలోకి ప్రీమియం క్రికెట్ సహా ఇతర స్పోర్టివ్ ఈవెంట్ల టికెట్ ధరలు చేరాయి. ఇకనుంచి ఐపీఎల్ వంటి టోర్నీల టికెట్ల రేట్లు భారీగా పెరగనున్నాయి. ఇప్పటివరకు ఇవన్నీ 28 శాతం పన్ను పరిధిలో ఉండేవి. ఇకపై అదనంగా మరో 12 శాతం చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో ఐపీఎల్ అభిమానులపై భారం పడే అవకాశం ఉంది.
అభిమానులకు భారం
ఐపీఎల్ చూడటం ఇకపై అభిమానుల జేబులకు మరింత భారమయ్యేలా మారింది. సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ పాలసీ ప్రకారం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు, అలాగే ఇతర ప్రీమియం స్పోర్ట్స్ ఈవెంట్స్‌కి 40 శాతం జీఎస్టీ విధించారు. ఇంతవరకు ఈ రేటు 28 శాతం మాత్రమే ఉండేది. దాంతో ఒక్కసారిగా 12 శాతం పెరిగింది. ఇక నుంచి ఐపీఎల్ టికెట్లు అత్యధిక ట్యాక్స్ లిస్టులో చేరాయి. ఇప్పటివరకు రూ.1,000 టికెట్‌పై 28 శాతం పన్ను వేయడంతో మొత్తం ధర రూ.1,280కి చేరేది. ఇక కొత్త రేటు ప్రకారం అదే టికెట్‌పై 40 శాతం పన్ను పడుతుంది. దీంతో ఆ టికెట్ ధర నేరుగా రూ.1,400 అవుతుంది. అంటే ప్రతి రూ.1,000 ఖర్చుపై అభిమానులు అదనంగా రూ.120 చెల్లించాల్సి వస్తుంది. ఐపీఎల్ టికెట్ ధరలపై ప్రభావం ఇలా ఉండబోతోంది.
పాత ధరలు.. కొత్త ధరలు ఇలా...
రూ. 500 టికెట్ - రూ. 700 (పాత ధర రూ. 640), రూ.1,000 టికెట్ -రూ.1,400 (పాత ధర రూ. 1,280), రూ.2,000 టికెట్ - రూ. 2,800 (పాత ధర రూ. 2,560). కొత్త జీఎస్టీ రేటుతో ఐపీఎల్ టికెట్లు క్యాసినోలు, రేస్ క్లబ్బులు, లగ్జరీ గూడ్స్ లిస్ట్‌లో చేరాయి. అంటే ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ చూడటం ఇప్పుడు సిగరెట్లు లేదా బెట్టింగ్ సర్వీసుల్లా ‘నాన్-ఎసెన్షియల్ ఖర్చు’ కేటగిరీలోకి వెళ్లిపోయింది.
బెట్టింగ్..జూదం, లాటరీ కూడా
బెట్టింగ్, జూదం, లాటరీ, గుర్రపు పందెం, ఆన్లైన్ మనీ గేమింగ్ వంటి కార్యకలాపాలను 40 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ రంగాల వ్యాపారాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనున్నది. అయితే, జీఎస్టీ స్లాబ్‌లో మార్పుల కారణంగా ఐపీఎల్ వంటి ఫ్రాంచైజ్ ఆధారిత ఈవెంట్లు ఖరీదైనవి మారనుండగా.. గుర్తింపు పొందిన ఈవెంట్లలో పాల్గొనే ప్రేక్షకులకు మాత్రం ఉపశమనం కలుగనున్నది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే దిశగా ఒక కీలకమైన అడుగు అని నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలంలో, ప్రేక్షకుల భాగస్వామ్యం, ఐపీఎల్‌లాంటి ఈవెంట్ల ప్రజాధారణపై ప్రభావం కనిపిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాధారణ అంతర్జాతీయ లేదా దేశీయ క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లపై జీఎస్టీ 18 శాతం గానే కొనసాగుతోంది. ఈ కొత్త 40 శాతం రేటు ప్రత్యేకంగా ఐపీఎల్, ఫ్రాంచైజీ లీగ్‌లను మాత్రమే ప్రభావితం చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com