IPL: రాజస్థాన్‌ను చిత్తు చేసిన గుజరాత్

ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్ష్య ఛేదనలో తేలిపోయింది. రాజస్థాన్ రాయల్స్ 159 పరుగులకు ఆలౌట్ కాగా.. గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించగా, రాజస్థాన్ రెండు గెలిచి మూడు ఓడిపోయింది.
రాణించిన సాయి సుదర్శన్
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82: 8 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ హాఫ్ సెంచరీ చేశాడు. సాయి సుదర్శన్ 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జోస్ బట్లర్ (36; 25 బంతుల్లో 5 ఫోర్లు)కూడా నిలకడగా బౌండరీలు రాబట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తీక్షణ వేసిన పదో ఓవర్‌లో సుదర్శన్ అర్ధ శతకం (32 బంతుల్లో) పూర్తి చేసుకోగా.. అదే ఓవర్‌లో చివరి బంతికి బట్లర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ క్రమంలో 10 ఓవర్లకు గుజరాత్ స్కోరు 94/2కు చేరింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో తేలిపోయిన రాజస్థాన్
లక్ష్య ఛేదనలో రాజస్థాన్ తేలిపోయింది. యశస్వి జైస్వాల్ ఏడు బంతుల్లో ఆరు పరుగులు చేసి అవుటవగా, ఆ వెంటనే వచ్చిన నితీష్ రాణాని కేవలం ఒక్క పరుగుకే మహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. రియాన్ పరాగ్ 14 బంతుల్లో 26 పరుగులు, ధృవ్ జురెల్ 4 బంతుల్లో ఐదు పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 41 పరుగులు చేసి అవుటయ్యాడు. లక్ష్య ఛేదనలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com