HCA: రూ.200 కోట్లు మాయం చేసిన హెచ్‌సీఏ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఆడిట్ నిర్వహిస్తేనే నిధుల దుర్వినియోగంపై సీఐడీకి క్లారిటీ రానుంది. జగన్ మోహన్ రావు అధ్యక్షుడు అయిననాటి నుంచి బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ. 240 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. ఇప్పుడు హెచ్‌సీఏ ఖాతాలో కేవలం రూ. 40 కోట్లు మాత్రమే ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. 20 నెలల్లో రూ. 200 కోట్లు ఖర్చు చేసింది హెచ్‌సీఏ. దేని కోసం ఖర్చు చేశారో బయట పడాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సీఐడీ భావిస్తోంది. 2014 నుంచి హెచ్‌సీఏ అక్రమాలపై ఇప్పటికే రెండు సార్లు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు. తాజాగా సీఐడీ సిఫార్సుతో మరోసారి హెచ్‌సీఏలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు. హెచ్‌సీఏ నిధుల గోల్మాల్ కేసులో నకిలీ బిల్స్‌తో బీసీసీఐ గ్రాంట్లు, హెచ్‌సీఏ నిధులను నిందితులు కొల్లగొట్టినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలినట్లు ఇటీవల అధికారులు తెలిపారు. హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ రామ్‌చందర్ నుంచి సీఐడీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న దేవరాజ్‌ను గత నెల 25న పుణెలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో ఈ నెల 7 నుంచి 13 వరకు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
మరోవైపు హెచ్‌సీఏలో అవకతవకల కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఐదో రోజు కస్టడీలో హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌ను అధికారులు విచారిస్తున్నారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్‌మాల్‌పై ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్న హెచ్‌సీఏ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అవకతవకలకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే దేవరాజ్ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు చేశారు.
సెలక్షన్ కమిటీపై సీఐడీకి ఫిర్యాదు
హెచ్‌సీఏ సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుల నియామకంపై సీఐడీకి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఏ ఫహీమ్ ఫిర్యాదు చేశారు. సెలక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక హెచ్‌సీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఈ కమిటీలో సభ్యులకు ఉండాల్సిన అర్హతలు లేకున్నా సభ్యులుగా నియమించారని ఆయన ఆరోపించారు. సీనియర్ కమిటీలో సభ్యులుగా ఉండాలంటే కనీసం 7 టెస్ట్ మ్యాచ్‌లో ప్లేయర్‌గా ఆడి ఉండాలని, లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాలని లేదా 10 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడినవారై ఉండాలని చెప్పారు. ఇట్లాంటి ఎన్నో అవకతవకలు ఉన్నాయని వాటిపై విచారణ జరిపి.. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నాయకత్వం సంక్షోభంలో పడింది. అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిపై సిఐడి కేసు ఉండగా.. ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ, కౌన్సిలర్‌పై మల్టీ క్లబ్ ఓనర్షిప్, విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు వస్తున్నాయి. దల్జీత్ సింగ్, బసవరాజు, సునీల్ అగర్వాల్‌పై హెచ్‌సీఏ మాజీ సభ్యుడు చిట్టి శ్రీధర్ ఏకసభ్య కమిటీ జస్టిస్ పి. నవీన్‌రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్‌సీఏలో మరో భారీ కుదుపుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్ కుటుంబం రెండు క్లబ్‌లు నడుపుతోంది. అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్రికెట్ క్లబ్‌లు దల్జీత్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ మార్పులకు హెచ్‌సీఏ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com