HCA: హెచ్‌సీఏ బెదిరింపులు నిజమే

HCA: హెచ్‌సీఏ బెదిరింపులు నిజమే
X
టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ సంచలన నివేదిక!

వివాదాస్పదంగా మారిన ఐపీఎల్-2025 టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ ముగిసింది. వివాదాస్పదంగా మారిన ఐపీఎల్ 2025 టికెట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను దోషిగా తేల్చారు. అదనపు టికెట్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ యాజమాన్యంపై హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌‌మోహన్ రావు, సెక్రటరీ ఒత్తిడి చేశారని, బ్లాక్‌మెయిల్ చేయడం కూడా నిజమేనని విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. హెచ్‌సీఏపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించారు.

ఇబ్బందులకు గురిచేసింది నిజమే

ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభంలో ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్‌ల టికెట్లలో తమకు అదనపు టికెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ బెదిరింపులకు పాల్పడుతోందని, ప్రెసిడెంట్ జగన్‌‌మోహన్ రావు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం లేఖ రాయడం సంచలనం రేపింది. ఇలా బెదిరింపులకు పాల్పడితే హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోతామని కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం హెచ్చరించింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విచారణ పూర్తి చేసిన విజిలెన్స్.. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై హెచ్‌సీఏ సెక్రెటరీ ఒత్తిడి తీసుకొచ్చినట్లు నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. టికెట్ల కోసం ఎస్ఆర్‌హెచ్ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపారు. కాగా, ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ మ్యాచులకు సంబంధించి 10 శాతం టికెట్లను ఫ్రాంచైజీ ఫ్రీగా ఇచ్చింది. అయినా అదనంగా మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై హెచ్‌సీఏ సెక్రెటరీ ఒత్తిడి తీసుకురావడంతో వివాదం మొదలైంది.

తాళాలు వేసింది నిజమే

నిబంధనల ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తున్నా.. అదనంగా మరో 10 శాతం టికెట్లు కావాలని హెచ్‌సీఏ కోరింది. అందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అంగీకరించలేదు. అయితే ఓపెన్ మార్కెట్లో టికెట్లు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టడంతో టికెట్లు ఇచ్చేందుకు సన్‌రైజర్స్ ఒప్పుకుంది. అయినా వ్యక్తిగతంగా తనకు మరో 10 శాతం టికెట్లు కావాలని ఎస్‌ఆర్‌హెచ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది సన్‌రైజర్స్ యాజమాన్యం. టికెట్లు ఇవ్వలేదనే కారణంతో మ్యాచుల సందర్భంగా ఎస్‌ఆర్‌హెచ్‌ను జగన్మోహన్ ఇబ్బందులకు గురిచేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్‌సీఏ సిబ్బంది తాళాలు వేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ను హెచ్‌సీఏ తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లుగా నివేదికలో తెలిపారు. అంతేగాక హెచ్‌సీఏ మీద చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.

Tags

Next Story