HCA: హెచ్‌సీఏ-సన్ రైజర్స్ వివాదం ముగిసినట్లేనా.?

HCA: హెచ్‌సీఏ-సన్ రైజర్స్ వివాదం ముగిసినట్లేనా.?
X
కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ.. తమ తప్పేమీ లేదంటున్న క్రికెట్ అసోసియేషన్

క్రికెట్ ను ప్రోత్సహిస్తూ.. యువ ఆటగాళ్లకు అండగా నిలవాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్… వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆధిపత్య పోరు.. అవినీతి ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉండే HCU.. మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. క్రికెట్ ప్రపంచం అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మేనియాలో మునిగిపోతుంటే.. హైదరాబాద్ లో మాత్రం పాస్ ల లొల్లి కలకలం రేపింది. స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తే కానీ ఈ వివాదం ఓ కొలిక్కి రాలేదు. చివరికి రెండు వర్గాలు కూర్చుని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాయి. అయితే ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగినట్లేనా.. లేకా భవిష్యత్తులో ఇంకా కొనసాగుతుందా అన్న అనుమానం క్రికెట్ అభిమానులను వెంటాడుతోంది.

అసలేం జరిగిందంటే..?

పాసుల విష‌యంలో హెచ్‌సీఏ ఇబ్బందులు పెడుతున్న‌ట్లు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఒక మెయిల్ కూడా బ‌హిర్గ‌త‌మైంది. పాసుల కోసం హెచ్‎సీఏ తమను బెదిరింపులకు గురి చేసిందని SRH యాజమాన్యం చెప్పడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. పాసులు ఇవ్వకపోతే స్టేడియంలోని కొన్ని బాక్సులకు తాళాలు వేసి ఇబ్బందులు పెట్టారని పేర్కొంది. ఇలాగైతే త‌మ వల్ల కాదని.. తాము వేరే చోటుకు వెళ్లిపోతామని హెచ్‎సీఏకి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ మేనేజ్మెంట్‎ లేఖ రాసింది. అయితే సన్ రైజర్స్ ప్రాంఛైజీ చేసిన ఆరోపణలను HCU ఖండిస్తోంది. తమను అభాసుపాలు చేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తోంది. హెచ్‌సీఏ ప‌రువుకు భంగం క‌లిగించేలా చేయ‌డం స‌బ‌బు కాదంది. కోటాకు మించి అద‌న‌పు పాసులు హెచ్‌సీఏ ఎప్పుడూ అడ‌గ‌లేదంది.

వేగంగా స్పందించిన సర్కార్

హెచ్‌సీఏ వ్యవహారశైలిని గమనించిన ప్రభుత్వం... నిజనిజాలు తేల్చేందుకు విచారణకు ఆదేశించింది. ఉచిత పాస్‌ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ పై వేధింపుల వ్యవహరంలో సీఎం రేవంత్ సోమవారం విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమించారు. సన్‌రైజర్స్ యాజమాన్యంపై హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ప్రవర్తనపై ఉన్న అభ్యంతారాలు ఏమిటి? జగన్ ఎందుకు ఆలా వ్యవహరించారు? ఆయన వెనుక బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

హెచ్‌సీఏ ఏమంటోంది..

సన్ రైజర్స్ ఆరోపణలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌నే ఉద్దేశంతో కొన్ని స‌మ‌స్య‌లున్నా తాము మౌనంగా ఉంటున్నామని హెచ్‌సీఏ తెలిపింది. హెచ్‌సీఏ కార్య‌వ‌ర్గ స‌భ్యుల ప‌ట్ల ఎస్ఆర్‌హెచ్ ఉద్యోగ బృందంలోని కొంద‌రు వ్య‌వ‌హ‌రించిన అమ‌ర్యాద‌పూర్వ‌క‌మైన తీరు వ‌ల్లే ఈ స‌మ‌స్య‌లు వచ్చాయంది. ఇప్ప‌టికైనా సమస్యలు వీడి హైదరాబాద్ క్రికెట్ బ్రాండ్ ను ప్రపంచానికి పరిచయం చేద్దామని పిలుపునిచ్చింది.

Tags

Next Story