HEAD COACH: జగజ్జేతల వెనుక అమోల్ మజుందార్

దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఆటలో రికార్డు స్థాయిలో పరుగులు సాధించిన తర్వాత కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించని దురదృష్టవంతుల్లో అమోల్ మజుందార్ పేరు ఉంటుంది. ముంబైకి చెందిన 51 ఏళ్ల మజుందార్ 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 30 సెంచరీలు సహా 11,167 పరుగులు సాధించాడు. అయితే ఏనాడూ భారత్‌కు ఆడే అవకాశం రాలేదు. ఈ దేశవాళీ దిగ్గజం కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్‌లో మర్చిపోలేని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. రెండేళ్ల క్రితం మహిళల టీమ్‌కు కోచ్‌గా వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలో జట్టు ఎంతో రాటుదేలింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బలంగా నిలబడిన మజుందార్ జట్టుకు మద్దతుగా నిలుస్తూ తన ప్లేయర్లపై నమ్మకం ఉంచాడు. ఆయన నమ్మిన ప్లేయర్లు ఇప్పుడు దానిని నిలబెట్టారు. చాంపియన్‌గా నిలిచి కోచ్‌కు కానుక అందించారు.
అమోల్ మజుందార్ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుంది. కానీ ఇతను ఎవరనేది చాలామందికి తెలియదు. అమోల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో టీమ్ ఇండియా తరపున ఎప్పుడు ఆడలేదు. అమోల్ తను ఆడిన తోలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే 260 పరుగులు చేసి ఫస్ట్-క్లాస్ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. బీసీసీఐ 2023 లో అమోల్ మజుందార్ ను భారత మహిళా జట్టు హెడ్ కోచ్ గా నియమించింది. ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో కోచ్ అమోల్ కీలక పాత్ర పోషించారు. తన యంగ్ ఏజ్ లో టీమ్ ఇండియా తరపున ఆడక పోయినప్పటికీ కూడా ఒక కోచ్ గా ఇండియాకు కప్ తీసుకురావడం అనేది మాములు విషయం కాదు. అమోల్ మజూందార్ పేరు భారత మహిళా క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
కెప్టెన్ మాటల్లో...
“ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత సర్ కొంచెం కోపంగా మాట్లాడారు కానీ అది మాకు ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఆ మాటల్లో ప్రేమ, బాధ్యత ఉన్నాయి. ఆయన చెప్పింది నిజమని అందరం అంగీకరించాం. ఆ తర్వాత ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి, జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాం. ఆ మ్యాచ్‌లో మనం ఎలా ఓడిపోయామో దేశం అంగీకరించలేదు. అందుకే తర్వాతి మ్యాచ్‌లలో అదే ఉత్సాహం కనిపించింది” అని హర్మన్‌ప్రీత్ చెప్పింది. మజుందార్ కూడా ఆ సమయంలో జట్టులో మార్పు స్పష్టంగా కనిపించిందని చెప్పారు. “ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లలో ఒక స్పష్టమైన మానసిక మార్పు వచ్చింది. ప్రాక్టీస్ సమయంలో ఉత్సాహం, శక్తి, దృష్టి అన్నీ మరింత పెరిగాయి. అంతకు ముందు కన్నా ఆ సారి ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం కనిపించింది" అని చెప్పారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్‌గా, అలాగే దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో ఇంటర్మ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అదనంగా ముంబై జట్టు ప్రధాన కోచ్‌గా, భారత అండర్-19, అండర్ -23 జట్లలో కోచింగ్ స్టాఫ్‌లో కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుని అమోల్ మజూందార్ పేరును భారత మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

