HOCKEY TEAM: ఆసియా కప్ గెలిచి..ప్రపంచకప్ బరిలో నిలిచి..

ఆసియా కప్ ఫైనల్‌లో విజయ కేతనం ఎగురవేసి ట్రోఫీని అందుకున్న భారత హాకీ జట్టు.. ఈ గెలుపుతో ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ బెర్త్నూ దక్కించుకుంది. ప్రపంచ కప్ వచ్చే ఏడాది నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా జరగనుంది. ఆసియా కప్తుదిపోరులో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను భారత్ చిత్తు చేసింది. తద్వారా అపజయమే ఎరుగకుండా టోర్నమెంట్‌ను ముగించిన ఘనతనూ సొంతం చేసుకుంది. భారత హాకీ జట్టు నాలుగోసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. గతంలో భారత్ 2017, 2007, 2003లో హాకీ ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. పాకిస్తాన్ హాకీ ఆసియా కప్ టైటిల్‌ను కేవలం మూడుసార్లు (1982, 1985, 1989) గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు అజేయంగా ఫైనల్‌కు చేరుకోగా.. ఫైనల్ మ్యాచ్‌లో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ముందు 5 సార్లు ఆసియా ఛాంపియన్ అయిన దక్షిణ కొరియా ఓటమిపాలైంది.
వరల్డ్ కప్‌నకు ఎంట్రీ
భారత జట్టు ఆసియా కప్ ఫైనల్స్ ఆడడం ఇది తొమ్మిదోసారి. నాలుగవసారి ఛాంపియన్‌గా నిలిచింది. చివరిసారిగా 2017లో ఆసియా కప్ టైటిల్ గెలుచుకుంది. ఆసియా కప్ టైటిల్స్‌లో భారత్ కంటే ఎక్కువ టైటిల్స్ గెలిచిన జట్టు సౌత్ కొరియా (5) మాత్రమే. ఇక ఫైనల్‌లో సౌత్ కొరియాపై భారత్ తన స్కోరును 2-2కు పెంచుకుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య మూడు ఫైనల్స్ జరిగాయి. ఇందులో సౌత్ కొరియా రెండు, భారత్ ఒక ఫైనల్ గెలుచుకున్నాయి. ఈ విజయంతో టీమిండియా నేరుగా నెదర్లాండ్స్, బెల్జియంలో జరగబోయే ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ 2026కు అర్హత సాధించింది.
అనుకున్నది సాధించాం
ఆసియా కప్ గెలిచిన అనంతరం భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ తదుపరి లక్ష్యం ప్రపంచ కప్ అని చెప్పాడు. తామెంతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. ప్రతి మ్యాచ్ నుంచి తాము నేర్చుకుంటున్నామని పేర్కొన్నాడు. ఒక టీమ్‌గా బాగా ప్రదర్శన ఇచ్చామని వెల్లడించాడు. ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలని, ఆసియాలో ఆధిపత్యం చెలాయించాలనేది తమ ఆలోచన అని మరో ఆటగాడు హార్దిక్ సింగ్ చెప్పాడు. ఇప్పుడు అది జరిగిందని తెలిపాడు. "మేం ఏ జట్టునైనా ఓడించగలమని మాకు తెలుసు. సూపర్ ఫోర్లో, ముఖ్యమైన మ్యాచ్‌లలో, మా ఫార్వర్డ్లు, మా డిఫెండర్లు చాలా బాగా ఆడతారని మాకు తెలుసు. ప్రేక్షకులు చాలా బాగా ఉత్సాహపరిచారు. అభిమానులు ఆనందంగా ఉన్నారు. వాతావరణం కూడా బాగుందని నేను భావిస్తున్నాను. మొత్తం టోర్నమెంట్ బాగా జరిగింది" అని హార్దిక్ సింగ్ తెలిపాడు.
గర్వంగా ఉందన్న కోచ్
భారత్ టీమ్ పట్ల గర్వంగా ఉందని హాకీ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ తెలిపాడు. "మేం ఆటను బాగా నియంత్రించాం. కొంచెం ఓపికగా ఉన్నాం. చాలా అవకాశాలను సృష్టించాం. నాలుగు గోల్స్ చేశాం. ఇది మేం ఆడిన ఇతర మ్యాచ్ కంటే చాలా ఎక్కువ. కొరియా మంచి జట్టు. వారు లోతుగా ఆడతారు, వారు రక్షణాత్మకంగా ఆడతారు. వారిని ఓడించడం కష్టం, కానీ మేం మా అవకాశాలను ఉపయోగించుకున్నాం. ఫైనల్‌లో నాలుగు గోల్స్ సరిపోతాయి" అని చెప్పాడు. మరోవైపు ఆసియా కప్ గెలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువరు ప్రముఖులు హాకీ జట్టుకు కంగ్రాట్స్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com