CT-2025: పాకిస్థాన్ చెత్త రికార్డు

CT-2025: పాకిస్థాన్ చెత్త రికార్డు
X
ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటకు... మండిపడుతున్న ఫ్యాన్స్

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. ఎడతెరిపి లేని వర్షంతో ఔట్‌ఫీల్డ్ మొత్తం తడిసిపోయింది. దీంతో టాస్‌ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు.. ఇరు జట్లకు చెరో పాయింటు కేటాయించారు. పాక్‌తో పాటు బంగ్లా ఒక్క విజయం లేకుండానే టోర్నీ ముగించింది. మరోవైపు.. గ్రూప్ఎ- నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. CTకి ఆతిథ్యమిచ్చిన దేశం టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. 2000 సంవత్సరంలో CTకి ఆతిథ్యమిచ్చినప్పటికీ కెన్యా కూడా ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది. కానీ, ఆ సమయంలో కెన్యా జట్టు ప్లేఆఫ్ దశలో ఆడింది. 2002కి ముందు ICC నాకౌట్ ట్రోఫీగా పిలిచిన ఈ టోర్నీని ఆ తరువాత ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చారు.


పట్టికలో అట్టడుగున దాయాది

దాయది పాకిస్థాన్ క్రికెట్ సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్ మరో చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. 2002లో గ్రూప్ స్టేజ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఒక్క విజయం సాధించకుండా, ఛాంపియన్స్​ ట్రోఫీ పట్టికలో అట్టడుగున నిలిచిన తొలి ఆతిథ్య దేశంగా దాయాది దేశం ఘోర అవమానం మూటగట్టుకుంది. గ్రూప్ Aలో పాకిస్థాన్ కేవలం 1 పాయింట్, -1.087 నెట్​ రన్​రేట్‌తో ఎలిమినేట్‌ అయ్యింది.

29 ఏళ్ల వెయిటింగ్.. మూడు రోజుల ముచ్చట

పాకిస్థాన్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. కొన్నేళ్లుగా ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూసిన పాక్.. ఆ కల నెరవేర్చుకుంది. అయితే అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. 29ఏళ్ల తర్వాత ఛాంపియన్స్​ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాక్ దక్కించుకుంది. కానీ, ఇది పాక్​కు మూడు రోజుల ముచ్చటే అయ్యింది. చివరికి ఒక్క విజయం లేకుండా టోర్నీ నుంచి తప్పుకొంది. దీంతో పాక్ పై విమర్శల జల్లు కురుస్తోంది.

పాక్ ప్రైజ్ మనీ ఎంతంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు తమ జర్నీ ముగించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ICC టోర్నీ నిర్వహిస్తున్న పాక్ గెలుపు రుచి చూడకుండానే నిష్క్రమించింది. బంగ్లాతో జరగాల్సిన మ్యాచు వర్షం కారణంగా రద్దైంది. అయితే, పాక్‌కు ICC నుంచి కొంత ప్రైజ్ మనీ రానుంది. దాదాపు రూ.2.37 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. 1996 తర్వాత పాకిస్తాన్‌లో జరుగుతున్న తొలి ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇది.

Tags

Next Story