ICC Test Rankings: పదేళ్ల తర్వాత టాప్‌-20 నుంచి ఔట్ అయిన విరాట్ కోహ్లీ..

ICC Test Rankings:  పదేళ్ల తర్వాత టాప్‌-20 నుంచి ఔట్ అయిన విరాట్ కోహ్లీ..
X
ఒకప్పుడు అలవోకగా సెంచరీలు, ఇప్పుడు క్రీజులో నిలబడడానికే తంటాలు

కొంత కాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీకి మరో చేదు వార్త. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏకంగా 22వ స్థానానికి పడిపోయాడు. 20వ స్థానానికి దిగువకు పడిపోవడం పదేళ్లలో ఇదే తొలిసారి. మంగళవారమే 36వ వసంతంలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. కొన్ని రోజులుగా ఆశించిన మేర రాణించలేక ఇబ్బందులు పడుతున్నాడు. సొంతగడ్డపై భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవ్వడంలో విరాట్ కోహ్లీ వైఫల్యం ఒక కారణం. ఒకప్పటిలా కోహ్లీ రాణించి ఉంటే ఈ చేదు ఫలితం వచ్చి ఉండేది కాదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.

బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 22వ స్థానానికి పడిపోయాడు. ఈ దశాబ్ద కాలంలో టాప్‌ 20 నుంచి స్థానం గల్లంతవడం ఇదే మొదటిసారి. చివరగా 2014 డిసెంబర్‌లో విరాట్ టాప్‌ 20లో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్ పర్యటనలో 5 టెస్టుల సిరీస్‌లో 13.4 సగటు నమోదు చేయడంతో ర్యాంకుల్లో దిగజారాడు. ఆపై పుంజుకున్న విరాట్.. 2018లో నంబర్‌వన్‌ టెస్టు బ్యాటర్‌గా నిలిచాడు. మొన్నటివరకు టాప్తా-10లో ఉన్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 15.50 సగటుతో పరుగులు చేయడంతో మరోసారి ర్యాంకుల్లో కిందికి పడిపోయాడు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా టాప్‌ 20 నుంచి స్థానం కోల్పోయాడు. రోహిత్ 26వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ టెస్టుల్లో అదరగొట్టిన రిషబ్ పంత్‌ అయిదు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్‌ ఓ ర్యాంకు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్‌ గిల్‌ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని16వ ర్యాంకుకు చేరుకున్నాడు. జో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా రెండు స్థానాలు ఎగబాకి.. ఆరో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కాగిసో రబాడ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా, అశ్విన్‌ టాప్‌-2లో ఉన్నారు.

Tags

Next Story