BGT: మెరిసిన బుమ్రా.. బెదిరిన కంగారులు

BGT: మెరిసిన బుమ్రా.. బెదిరిన కంగారులు
X
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రోజే కూలిన 17 వికెట్లు... నాలుగు వికెట్లతో రాణించిన కెప్టెన్ బుమ్రా

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. బ్యాటర్లు 150 పరుగులకే చేతులెత్తేసిన వేళ.. బౌలర్లు టీమిండియాను ఆదుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా సరిగ్గా 150 పరుగులు చేయగలిగింది. బోర్డర్- గవాస్కర్ సీజన్ లోని తొలిటెస్టులో టీమిండియాకు చెక్ పెట్టాలని అనుకుంది ఆస్ట్రేలియా. అనుకున్నట్లుగానే భారత బ్యాటర్లకు చుక్కలు చూపించింది. అయితే తెలుగోడు బ్యాటింగ్ కు రావడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పోరాటంతో కంగారూ టీమ్ బేజారైంది. అటాకింగ్ బ్యాటింగ్‌తో నితీశ్.. కంగారూల బెండు తీశాడు. 41 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. పిచ్ పేస్, బౌన్స్‌కు సహకరిస్తున్న వేళ టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. ఈరోజు తొలి సెషన్ లో కంగారులను చుట్టేస్తే భారత్ కు కీలక ఆధిక్యం దక్కే అవకాశం ఉంది. భారత బౌలర్లకు అదే సాధ్యమైతే కంగారులకు కంగారు తప్పదు.


చెలరేగిన బుమ్రా

తొలి టెస్టులో ఒకే రోజు 17 వికెట్లు కూప్పకూలాయి. కంగారుల గడ్డపై 1952 తర్వాత టెస్టుల్లో మొదటి రోజు ఇన్ని వికెట్లు నేలకూలడం ఇదే తొలిసారి. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్ పై అటు కంగారు బౌలర్లు హడలెత్తించగా.. భారత బౌలర్లు వారిది వారికి తిరిగిచ్చేశారు. బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం కంగారుల వల్ల కాలేదు. పేస్, బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్ పై టీమిండియా సారధి చెలరేగిపోయాడు. ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లతో కంగారులను కంగారు పెట్టాడు. భారత్ కు 50 పరుగులకుపైగా ఆధిక్యం లభిస్తే ఈ పిచ్ పైమంచి ఆథిక్యం సాధించినట్లే. ఇప్పటికే నిప్పులు చెరుగుతున్న భారత సీమర్లను ఎదుర్కోవడం కంగారులకు అంత తేలికేం కాదు.

పంత్ ఖాతాలో మరో రికార్డు


టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో భారతీయ ఆటగాడిగా పంత్ (2,032) నిలిచారు. ఈ ఫీట్‌ని 52 ఇన్నింగ్సులోనే ఆయన అందుకున్నారు. తొలి రెండు స్థానాల్లో రోహిత్ (2,685), కోహ్లీ (2,432) ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ వికెట్ కీపర్‌గానూ పంత్ (661) రికార్డు సృష్టించారు.

72 ఏళ్ల రికార్డు బద్దలు

పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజే 72 ఏళ్ల రికార్డు కాల గర్బంలో కలిసిపోయింది. మొదటి రోజే 17 వికెట్లు నేలకూలాయి. పెర్త్‌ మైదానంలో 72 ఏళ్లలో ఎప్పుడూ తొలి రోజు ఆటలోనే ఇన్ని వికెట్లు నేలకూలలేదు.

Tags

Next Story