IND vs AUS: సమం చేస్తారా..? గెలిచేస్తారా..?

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు ఆఖరి పోరుకు సిద్దమైంది. నేడు బ్రిస్బేన్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగో టీ20లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు యాషెస్ సిరీస్ నేపథ్యంలో సీనియర్లు దూరమైన వేళ యువ ప్లేయర్లతో ఆడుతున్న ఆసీస్.. సిరీస్ సమం చేయడంపై కన్నేసింది. టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకంలో భాగంగా ఆఖరి మ్యాచ్‌లోనూ మార్పులు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరి కోసం వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు శివమ్ దూబేకు విశ్రాంతి ఇవ్వవచ్చు.
బ్యాటర్లు జూలు విదిలించాల్సిందే
భారత్ గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ పరంగా అంచనాలను అందుకోలేకపోయింది. మూడో టీ20లో సుందర్ రాణించి జట్టును గెలిపించగా.. నాలుగో టీ20లో గెలుపు క్రెడిట్ బౌలర్లకే దక్కుతుంది. అభిషేక్, గిల్, సూర్య, తిలక్ తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో త్వరగానే అవుటవుతున్నారు. ఆఖరి మ్యాచ్‌లో వీళ్లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, సుందర్ రాణిస్తూ జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. నాలుగో టీ20లో 167 పరుగుల తక్కువ స్కోరే చేసినప్పటికీ ఆసిస్‌ను నిలువరించిన తీరు భారత బౌలింగ్ దళం బలాన్ని తెలియజేస్తోంది.
పేసర్లపైనే బాధ్యత
నాలుగో టీ20లో ఆస్ట్రేలియాను స్పిన్‌తోనే కొట్టింది భారత్. ఈసారి బాధ్యత పేసర్లదే. పేస్‌కు అనుకూలమైన బ్రిస్బేన్ పిచ్‌పై బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ కీలకం కానున్నారు. అర్ష్‌దీప్ జోరు మీద ఉండడం సానుకూలాంశం. అతడు బుమ్రాతో కలిసి గబ్బాలో దూకుడు కొనసాగిస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు ఆరంభంలోనే కళ్లెం వేయచ్చు. పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబె ప్రదర్శన జట్టుకు ముఖ్యమే. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే భారత్ కొనసాగించొచ్చు. వరుణ్ చక్రవర్తితో పాటు.. అక్షర్, సుందర్ జట్టులో కొనసాగనున్నారు. టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్‌ను టీమిండియా ప్రయోగాలకు ఉపయోగించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

