KOHLI: విరాట్ కోహ్లీ 300వ వన్డే

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 300వ వన్డే ఆడనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు(ఆదివారం) న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు. ఇప్పటివరకూ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, ధోనీ 300 వన్డేలు ఆడారు. వారి తర్వాత 300వ వన్డే ఆడుతున్న ఏడో భారత ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. కోహ్లీ 2008లో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. విరాట్ కోహ్లీ వన్డే చరిత్రలో 55 సగటుతో 10,000 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ గా రికార్డు సాధించాడు. 299 మ్యాచ్‌లలో 58.20 సగటుతో 14085 పరుగులు చేశాడు. ధోనీ 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (51) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో న్యూజిలాండ్‌పై 117 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై 111 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
సచిన్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం న్యూజిలాండ్ తో జరిగే మ్యాచుకు కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచులో సచిన్ రికార్డులపై కోహ్లీ కన్నేశాడు. విరాట్ 106 పరుగులు చేస్తే సచిన్‌ను దాటి కివీస్‌పై వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. కివీస్ పై 42 వన్డేలు ఆడి సచిన్ 1750 పరుగులు చేయగా... కోహ్లీ 31 వన్డేల్లో 1645 పరుగులు చేశాడు. ఓవరాల్ గా కివీస్ పై 1971 పరుగులు చేసి పాంటింగ్ టాప్లో ఉన్నాడు.
సచిన్ కంటే కోహ్లీనే గొప్ప: మాజీలు
ప్రపంచ క్రికెట్ లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు విరాట్ కోహ్లీనే అని మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. కోహ్లీ ఘనతలను నిశితంగా పరిశీలించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. వన్డే ఫార్మాట్లో 51 సెంచరీలు చేయడం మామూలు విషయం కాదని అన్నారు. ఛేజింగ్ లో 28 సెంచరీలు చేయడం గొప్ప విషయమని పొగిడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com