IND VS SA: నేటి నుంచే ధనాధన్ సమరం

దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. ఇందులోభాగంగా.. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్ ముగిశాయి. నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన టీమ్ఇండియా.., 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టీ20ల వంతు వచ్చింది. డిసెంబర్ 9 నుంచి 19 వరకు భారత్ - దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ జరగనుంది. మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారనుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఉండటంతో ఈ సిరీస్ మరింత ప్రాముఖ్యత సాధించుకుంది. టెస్టు, వన్డేల్లో ఎలా ఉన్నా టీ20ల్లో మాత్రం టీమిండియా నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతోంది. కొంతకాలంగా రెడ్‌బాల్ క్రికెట్లో టీమ్ఇండియా ప్రదర్శన పేలవంగా ఉంది. అయినప్పటికీ వైట్ బాల్ క్రికెట్లో.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో మాత్రం మంచి ప్రదర్శనలు చేస్తోంది. డిసెంబర్ 9న మొదలయ్యే ఈ సిరీస్ డిసెంబర్ 19న ముగియనుంది. తొలి టీ20 కటక్ వేదికగా డిసెంబర్ 9న మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. రెండో టీ20 డిసెంబర్ 11న గురువారం రాత్రి న్యూ చండీగఢ్ వేదికగా జరగనుంది. మూడో టీ20 ధర్మశాలలో డిసెంబర్ 14 ఆదివారం, నాలుగో టీ20 లక్నోలో డిసెంబర్ 17న బుధవారం, ఇక ఆఖరి టీ20 అహ్మదాబాద్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 19న శుక్రవారం రోజు ముగియనుంది. ఈ ఐదు టీ20ల్లో కూడా టాస్ కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే చలి ప్రభావంతో పాటు వాతావరణంలో తేమ కూడా అధికంగా ఉండే అవకాశంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది.
గిల్ వచ్చేశాడు..
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ సందర్భంగా గాయానికి గురైన గిల్ ఆ మ్యాచ్‌లో 3 బంతులు ఎదుర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అసలు మైదానంలోకి రాలేదు. మూడో టెస్ట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో వన్డే సిరీస్‌లోనూ పాల్గొనలేదు. ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించడంతో టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. అభిషేక్‌శర్మ లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌వర్మ, సంజు శాంసన్, శుభ్‌మన్ గిల్ లాంటి బ్యాటర్లు, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లతో టీమ్ఇండియా బ్యాటింగ్ లైన్ బలంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి వికెట్ టేకర్లతో భారత జట్టు సమతూకంగా కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

