IND vs WI: ఫాలో ఆన్‌లో పోరాడుతున్న విండీస్

భారత్‌తో జరిగిన తొలి టెస్టులో విఫలమైన విండీస్ బ్యాటర్లు.. అరుణ్‌జైట్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కాస్త పుంజుకున్నారు. జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కించి టీమ్ఇండియాకు మంచి లక్ష్యాన్ని నిర్దేశించేందుకు పోరాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 140/4తో మూడో రోజు ఆటను కొనసాగించిన కరేబియన్ జట్టు.. కుల్దీప్ యాదవ్ (5/82) దెబ్బకు కుదేలై 248 పరుగులకు ఆలౌటైంది. దీంతో 270 పరుగులు వెనుకబడి ‘ఫాలో ఆన్’ నుంచి తప్పించుకోలేకపోయింది. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (10), అథనాజ్ (7) విఫలమవడంతో వెస్టిండీస్ ఫాలో ఆన్‌లోనూ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో కరేబియన్ జట్టు మరోసారి కుప్పకూలి మూడో రోజే మ్యాచ్ ముగుస్తుందేమోనని అంతా భావించారు. కానీ, విండీస్ బ్యాటర్లు జాన్ కాంప్‌బెల్ (87*; 145 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షైయ్ హోప్ (66*; 103 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కరేబియన్ జట్టు 173/2 స్కోరుతో నిలిచి ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. కాంప్‌బెల్, షైయ్ హోప్ అభేద్యమైన మూడో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని (207 బంతుల్లో) నెలకొల్పింది. ఈ జంటను విడదీయడానికి భారత ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది. కాంప్‌బెల్ 69 బంతుల్లో, హోప్ 80 బంతుల్లో అర్ధ శతకాలు అందుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటర్లలో షైయ్ హోప్ (36) టాప్ స్కోరర్. అండర్సన్ ఫిలిప్ (24), టెవిన్ ఇమ్లాచ్ (21), ఖేరీ పియెరీ (23), జస్టిన్ గ్రీవ్స్ (21), జైడెన్ సీల్స్ (13) పరుగులు చేశారు. కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. జడేజా 3, బుమ్రా, సిరాజ్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ బ్యాటర్లు ఇలాగే రాణిస్తే స్కోరు బోర్డుపై మంచి స్కోరు పెట్టి భారత్ ను ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. అయితే నాలుగో రోజు భారత బౌలర్లు రాణిస్తే విండీస్ కు కష్టాలు తప్పవు.
ఆఖర్లో దూకుడు..
తొలి సెషన్లోనే విండీస్ ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ, పియరీ - ఫిలిప్ జోడీ దాదాపు 16 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉండిపోయింది. దీంతో 8 వికెట్లను నష్టపోయి లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్ తొలి ఓవర్లోనే పియరీని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సీలెస్ (13)తో కలిసి ఫిలిప్ (24*: 93 బంతుల్లో) భారత బౌలర్లను విసిగించాడు. చివరి వికెట్‌ను తీసిన కుల్దీప్ ఫైఫర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వికెట్లలో రవీంద్ర జడేజా 3.. సిరాజ్, బుమ్రా చెరొకటి తీశారు. వెస్టిండీస్‌పై కుల్దీప్ 4 టెస్టుల్లో 19 వికెట్లు తీశాడు. ఇక 19 వన్డేల్లో 33 వికెట్లు, 9 టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఎడమచేతి మణికట్టు స్పిన్నర్లలో అత్యధిక ‘ఫైఫర్’ (ఐదు వికెట్ల ప్రదర్శన) తీసిన భారత బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. అంతర్జాతీయంగానూ తక్కువ మ్యాచుల్లో పడగొట్టిన బౌలర్ కూడా కుల్దీప్ కావడం గమనార్హం. 15 టెస్టుల్లో ఐదు సార్లు తీయగా.. జానీ వార్డ్లే 28 టెస్టుల్లో 5సార్లు పడగొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com