IND WIN: కివీస్ బౌలర్లను వేటాడేసిన భారత బ్యాటర్లు

భారత క్రికెట్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో బ్యాట్, బంతితో సమన్వయంగా మెరిసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థిని ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. భారత యువత శక్తి, అనుభవజ్ఞుల స్థిరత్వం కలసి ఈ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కివీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. గ్లెన్ ఫిలిప్స్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా.. అతడి ఇన్నింగ్స్ కూడా జట్టును పెద్ద స్కోరు వైపు నడిపించలేకపోయింది. మార్క్ చాప్మన్, మిచెల్ శాంట్నర్ మినహా మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే న్యూజిలాండ్‌కు షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే డెవోన్ కాన్వేను హర్షిత్ రాణా అవుట్ చేశాడు. ముందుకొచ్చి దూకుడుగా ఆడాలనుకున్న కాన్వే.. మిడాఫ్ వద్ద హార్దిక్ పాండ్య పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ పర్యటనలో కాన్వేను అవుట్ చేయడం హర్షిత్‌కు ఇది అయిదోసారి కావడం గమనార్హం. వెంటనే మరో ఓవర్లో రచిన్ రవీంద్రను హార్దిక్ పాండ్య షార్ట్ బంతితో బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ 2 ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ కొంత బాధ్యత తీసుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అడపాడదపా ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు పెంచాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి న్యూజిలాండ్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
మధ్య ఓవర్లలో కూడా భారత బౌలర్లు ఏ మాత్రం సడలింపు ఇవ్వలేదు. రవి బిష్ణోయ్ తన గూగ్లీలు, ఫ్లిప్పర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కుల్దీప్ యాదవ్ వేసిన ఓవర్లో చాప్మన్, ఫిలిప్స్ కొన్ని భారీ షాట్లు ఆడడంతో స్కోరు కొంత ఊపందుకున్నా.. కీలక సమయంలో వరుస వికెట్లు పడటంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. చివర్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పోరాటం చేసినా.. భారత బౌలింగ్ దెబ్బకు కివీస్ 153 పరుగులకే పరిమితమయ్యింది. భారత బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు. 153 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటిసారి చిన్న ఆటుపోటును ఎదుర్కొంది. తొలి బంతికే సంజూ శాంసన్ సున్నాకే వెనుదిరగడం అభిమానులను క్షణకాలం ఆందోళనకు గురిచేసింది. హెన్రీ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్ అయిన సంజూ.. తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. అయితే ఆ వెంటనే ఇషాన్ కిషన్ బ్యాట్ ఝుళిపించడంతో ఆ వికెట్ ప్రభావం కనిపించలేదు. ఇషాన్ తొలి ఓవర్లోనే వరుసగా రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాది భారత ఇన్నింగ్స్‌కు వేగం అందించాడు. మరో వైపు అభిషేక్ శర్మ కూడా దూకుడు కొనసాగించాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ 49 పరుగులు సాధించి మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. సోధి బౌలింగ్‌లో ఇషాన్ అవుట్ అయినా.. అభిషేక్ ఆగలేదు. బుధవారం విశాఖపట్నంలో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
