IND WIN: విశాఖలో విజయనాదం.. సిరీస్ కైవసం

సిరీస్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలర్లు రాణించగా, తరువాత బ్యాటర్లు అద్భుతం చేశారు. దాంతో దక్షిణాఫ్రికా మీద ODI సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ గెలుచుకుంది. యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ, విరాట్ కోహ్లీ (65 నాటౌట్), రోహిత్ శర్మ (75) అర్ధ సెంచరీలతో రాణించారు. 270 పరుగులు లక్ష్యాన్ని ఏ తడబాటు లేకుండా భారత జట్టు సునాయాసంగా విజయం సాధించింది, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం దక్షిణాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకే ఆలౌట్ చేసి పైచేయి సాధించారు. తరువాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటారు. తొలి వికెట్ కు ఏకంగా 155 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు జైస్వాల్, రోహిత్ శర్మ. దాదాపు 10 ఏళ్ల తరువాత తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం ఇది.
భారత బ్యాటర్లలో జైస్వాల్ సెంచరీ(106), రోహిత్ శర్మ(75), విరాట్ కోహ్లీ(65)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఒక్కడే ఒక వికెట్ తీశారు. మూడు వన్డేల సిరీస్‌లో రెండు భారత్ విజయం సాధించడంతో సిరీస్ లభించింది. టాస్ ఓడిన సఫారీలు తొలుత బ్యాటింగ్ చేశారు. 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (106) సెంచరీ బాదాడు. టెంబా బావుమా (48) రాణించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్ క్వింటన్ డికాక్ బలమైన పునాది వేసినా.. మిడిలార్డర్ వైఫల్యంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించలేకపోయింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గొప్పగా బౌలింగ్ చేయడం, మరోసారి ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నప్పటికీ ప్రసిద్ధ్ కృష్ణ.. కీలక దశల్లో వికెట్లు తీయడంతో సఫారీ జట్టును ఓ మోస్తరు స్కోరుకు భారత్ కట్టడి చేయగలిగింది. రికిల్టన్ డకౌటైనా.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ బవుమా (48; 67 బంతుల్లో 5×4)తో కలిసి డికాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. గత రెండు మ్యాచ్‌ల్లో 0, 8 పరుగులకే వెనుదిరిగిన డికాక్.. ఈ మ్యాచ్‌లో తనదైన శైలిలో చెలరేగిపోయాడు. 42 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 14వ బ్యాటర్ రోహిత్. శనివారం దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో కేశవ్ మహరాజ్ వేసిన 14వ ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ సింగిల్ తీసి 20 వేల క్లబ్బులో అడుగు పెట్టాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత అతడి పరుగులు 20,048కి చేరుకున్నాయి. వన్డేల్లో 11,516 పరుగులు సాధించిన హిట్‌మ్యాన్.. టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

