T20 World Cup : భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు

T20 World Cup : భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు  ఉగ్ర ముప్పు
న్యూయార్క్‌లో భద్రత భారీగా పెంపు

మరో మూడు రోజుల్లో వెస్టిండీస్‌/అమెరికా వేదికలుగా మొదలుకాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ‘హై ఓల్టేజ్‌ మ్యాచ్‌’గా భావిస్తున్న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. మూడువారాల క్రితమే ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో (వెస్టిండీస్‌లో ఓ దీవి) ప్రధాని సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేయగా తాజాగా ముష్కర ముఠాలు దాయాదుల పోరుకు ముప్పు తలపెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

‘ఐసిస్‌’ అండతో రెచ్చిపోతున్న ఓ ఉగ్ర ముఠా ఆన్‌లైన్‌ వేదికగా ‘మీరు మ్యాచ్‌ల కోసం వేచి చూస్తున్నారు. మేము మీకోసమే ఎదురుచూస్తున్నాం’ అని ఓ వ్యక్తి ఆయుధాలు ధరించి ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. అదే ఫొటోలో ‘నసావు స్టేడియం.. 09/06/2024’ అని కూడా ఉండటం ఆందోళనకు దారితీసింది. జూన్‌ 9న ఇదే స్టేడియంలో రోహిత్‌ సేన..పాక్‌తో తలపడనుంది.

న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్‌ పార్క్ స్టేడియంలో జూన్ 9న భారత్-పాక్ మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌కు బెదిరింపులు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో భద్రతను పెంచారు. అయితే తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, తమకున్న సమాచారం మేరకు భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ముప్పులేదని న్యూయార్క్‌ గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మన్‌హటన్‌కు తూర్పున 25 మైళ్ల దూరంలో ఉన్న ఐసెన్‌హోవర్‌ పార్క్ స్టేడియం ఉంది. అక్కడ జూన్ 3 నుంచి జూన్ 12 వరకు జరిగే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీని ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేలా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ చెప్పారు. అధునాతన నిఘా, సెక్యూరిటీ స్క్రీనింగ్ వంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని న్యూయార్క్ పోలీసులను ఆదేశించినట్లు గవర్నర్‌ తెలిపారు. ప్రజల భద్రతే తన మొదటి ప్రాధాన్యమని, క్రికెట్ వరల్డ్ కప్ సురక్షిత వాతావరణంలో ప్రజలంతా ఆస్వాదించేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు.

Tags

Next Story