ASIA CUP: మెరిసిన రోహిత్, గిల్... సూపర్ 4లో భారత్

ఆసియాకప్(asia cup)లో భారత్ బోణీ కొట్టింది. పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్( India vs Nepal)లో ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో వర్షం వల్ల రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో నేపాల్‌పై రోహిత్ సేన జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించినా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించిన రోహిత్ సేన సూపర్-4లోకి దూసుకెళ్లింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో లోపాలు స్పష్టంగా కనిపించినా సాధికర బ్యాటింగ్‌తో టీమిండియా విజయం సాధించింది.
సోమవారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన టీమిండియా నేపాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్ పేసర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో భారత సీమర్ల ధాటికి నేపాల్ బ్యాటర్లు వరుసగా కూలుతాయని అభిమానులు ఆశించారు. కానీ టీమిండియా పేలవ ఫీల్డింగ్ వల్ల ఆ అవకాశాలు చేజారాయి. అయిదు ఓవర్ల వ్యవధిలో నాలుగు క్యాచ్‌లు నేలపాలు కావడంతో నేపాల్ ఓపెనర్లు కుశాల్ బుర్టేల్, ఆసిఫ్ షేక్‌లు బతికిపోయారు. ఈ అవకాశాల్ని ఇద్దరూ సద్వినియోగం చేసుకున్నారు. బుర్టేల్ వేగంగా పరుగులు రాబట్టాడు. బౌండరీల మోత మోగిస్తూ అర్ధశతకం వైపు దూసుకెళ్తున్న బుర్టేల్‌కు పదో ఓవర్లో శార్దూల్ చెక్ పెట్టాడు. కుశాల్ భుర్తేల్ 38 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆసిఫ్ షేక్ (97 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. సోంపాల్ కామి (48; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కుశాల్ భుర్తేల్ (38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరు రాణించడంతో నేపాల్ అనుకున్న దానికంటే ఎక్కువ పరుగులు సాధించింది. 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసి నేపాల్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్, జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. హార్దిక్, షమి చెరో వికెట్ తీశారు. కుల్‌దీప్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు.
అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం డకవర్త్ పద్ధతిలో భారత విజయ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ధారించారు. ఈ లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారత్ ఛేదించింది. రోహిత్( Rohit Sharma), శుభ్‌మన్)Shubman Gill) పోటీ పడి పరుగులు చేసి జట్టుకు ఘనవిజయాన్ని అందించడంతో పాటు సూపర్-4 బెర్తునూ సాధించిపెట్టారు. 23 ఓవర్లలో 145గా నిర్ణయించగా.. 20.1 ఓవర్లలో ఓవర్లలో వికెట్ నష్టపోకుండా టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ (74 నాటౌట్; 59 బంతుల్లో 6×4, 5×6), శుభ్‌మన్ (67 నాటౌట్; 62 బంతుల్లో 8×4, 1×6) ఈసారి అదరగొట్టారు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే పాక్ సూపర్-4 చేరగా.. భారత్ రెండో బెర్తును సొంతం చేసుకుంది. నేపాల్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేటి శ్రీలంక-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌ను బట్టి గ్రూప్-బిలో సూపర్-4 బెర్తులు ఖరారవుతాయి.
ఇదేం ఫీల్డింగ్
వన్డే ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి సన్నద్ధమవుతున్న టీమ్‌ఇండియా ఫీల్డింగ్ ఆందోళన పరుస్తోంది. తొలి ఐదు ఓవర్లలోనే మూడు క్యాచ్‌లు నేల పాలు చేసిన టీమిండియా ఆటగాళ్లు నేపాల్ భారీ స్కోరు చేసేందుకు బాటలు వేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్ అనదగ్గ విరాట్ కోహ్లీ సులువైన క్యాచ్‌ను వదిలేయడం ఆశ్చర్యం కలిగించగా.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా బంగారం లాంటి అవకాశాలను నేలపాలు చేశారు. మ్యాచ్ మొత్తం ఫీల్డింగ్‌లో తడబాటు కనిపించగా.. చివర్లో కోహ్లీ ఒంటి చేతి క్యాచ్‌తో అదుర్స్ అనిపించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com