Eng Vs IND: తొలి టెస్టు ముంగిట టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ
Team India File Photo
India tour of England 2021: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ముంగిట భారత్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాటింగ్‌హామ్ వేదికగా బుధవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈరోజు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఓపెనర్ మయాంగ్ అగర్వాల్ గాయపడ్డాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విసిరిన బౌన్సర్ బంతి అతని హెల్మెట్‌కి బలంగా తాకింది. దాంతో.. అగర్వాల్ గాయాన్ని పరిశీలించిన ఫిజియో.. కాంకషన్‌కి గురైనట్లు నిర్ధారించాడు. దాంతో.. టీమ్ వైద్యులు పర్యవేక్షణలో ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ ఉన్నాడు.
మయాంక్ అగర్వాల్ కాంకషన్‌కి గురైనట్లు అధికారికంగా వెల్లడించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. అతను తొలి టెస్టుకి దూరమైనట్లు కూడా ప్రకటించింది. దాంతో.. మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ శర్మకి జోడీగా ఎవరు ఆడతారు..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇటీవల శ్రీలంక టూర్‌ని ముగించుకుని యువ ఓపెనర్ పృథ్వీ షా అక్కడికి చేరుకున్నా.. ప్రస్తుతం క్వారంటైన్‌లో అతను ఉన్నాడు. అతను తొలి టెస్టు మధ్యలో భారత్ జట్టుతో చేరే అవకాశం ఉంది.
గాయపడిన యువ ఓపెనర్ శుభమన్ గిల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు పృథ్వీ షాని అక్కడి పంపిన విషయం తెలిసిందే.రోహిత్ శర్మకి జోడీగా కేఎల్ రాహుల్‌ని తొలి టెస్టులో ఓపెనర్‌గా ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. అలానే ఈశ్వరన్ అభిమన్యు కూడా రేసులో ఉన్నాడు. కానీ.. ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ బాదిన రాహుల్ అతని కంటే ముందు వరుసలో ఉన్నాడు. అలానే హనుమ విహారిని కూడా ప్రయోగాత్మకంగా ఓపెనర్‌గా ఆడించడంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కానీ.. రోహిత్, కేఎల్ రాహుల్ జోడీనే బెస్ట్ అని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. భారత కాలమాన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com