india vs england : చేతులెత్తేసిన భారత్.. లీడ్‌లో ఇంగ్లాండ్..!

లీడ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు తొలి రోజు చేతులెత్తేసింది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆధిపత్యం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 78 పరుగులకే ఆలౌటైంది. లార్డ్స్ టెస్టు ఓటమితో కసి మీదున్న ఇంగ్లండ్ పేసర్లు.. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. దీంతో టీమ్‌ఇండియా 40.4 ఓవర్లలో 78 పరుగులకే చాపచుట్టింది. కోహ్లీసేనను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఇంగ్లండ్.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు తొలి సారిగా అత్యంత చెత్త ప్రదర్శన ఇదే. ఇంగ్లాండ్ బౌలర్లను తక్కువ అంచనా వేసి లీడ్స్‌లో అభాసుపాలయ్యారు. గత కొన్ని మ్యాచ్‌లుగా టాస్ ఓడుతూ వస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ లీడ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై పచ్చిక తక్కువగా ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావించిన కెప్టెన్ నిర్ణయం ఎంత తప్పో తొలి ఓవర్‌లోనే తెలిసిపోయింది.
తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా పుజార, కోహ్లీ కూడా పెవీలియన్ బాట పట్టారు. టాప్ 3 బ్యాట్స్‌మెన్‌లను అండర్సన్ అవుట్ చేశాడు. తొలి సెషన్‌లో 54 పరుగులు చేసిన భారత జట్టు రెండో సెషన్‌లో 22 పరుగులకు మిగిలిన 6 వికెట్లు కోల్పోయి 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్‌లో భారత జట్టుకు ఇదే మూడో అత్యల్ప టెస్ట్ స్కోర్ కాగా.. మొత్తానికి 9వ అత్యల్ప స్కోర్‌గా నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com