India vs Ireland T20: సిరీస్‌పై కన్నేసిన బుమ్రా సేన

ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ బుమ్రా(bumrah) రాక టీమిండియాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే తొలి టీ 20లో అద్భుత బౌలింగ్‌తో ఐర్లాండ్(India vs Ireland T20)ను మట్టికరిపించిన టీమిండియా... సిరీస్‌పై కన్నేసింది. నేడు జరిగే రెండో టి20లో ఐర్లాండ్‌పై గెలుపే లక్ష్యంగా బుమ్రా సేన( team india) బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో విజయం సాధించిన భారత జట్టు... బ్యాటింగ్‌లో రాణించాలని చూస్తోంది. చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి దిగిన సీనియర్ సీమర్ బుమ్రా మునుపటి వాడితో అదరగొట్టడం టీమిండియాకు పెద్ద ఊరటగా ఉంది. తొలి టీ 20లో ప్రసిధ్ కృష్ణ, స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని బుమ్రా సేన భావిస్తోంది. మరి రెండో టీ20లోనూ మనవాళ్లు అదే జోరు కొనసాగిస్తారా చూడాలి.
సోమవారం ఆసియా కప్ కోసం జట్టు ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శన ఆసక్తికరంగా మారింది. త్వరలో ఆసియాకప్, వన్డే ప్రపంచకప్( world cup) వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలు జరుగనుండటంతో.. టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోవాలని భావిస్తున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. సంజూ శాంసన్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. తొలి మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లతోనే ఇరు జట్లు బరిలో దిగే అవకాశాలున్నాయి. తొలి టీ20లో ఐర్లాండ్ టాపార్డర్‌ను సులువుగా కట్టడి చేసిన భారత బౌలర్లు లోయర్ ఆర్డర్ వికెట్లు పడగొట్టడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ లోటుపాట్లను సరిచేసుకునేందుకు ఈ మ్యాచ్ చక్కటి అవకాశం కానుంది.
మరోవైపు ఒత్తిడిలో ఉన్న ఆతిథ్య జట్టు సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవక తప్పదు. టాపార్డర్‌లో బల్బిర్నీ, కెప్టెన్ స్టిర్లింగ్, టకర్ బాధ్యత కనబరిస్తేనే ప్రత్యర్థికి దీటైన స్కోరు చేయొచ్చు. లేదంటే తొలి టి20లాగే ఓ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదముంది. బౌలింగ్‌లో యంగ్ వైవిధ్యమైన బంతులతో భారత్‌ను కంగారు పెట్టించాడు. జోష్ లిటిల్, మార్క్ అడైర్‌లు కూడా నిలకడగా బౌలింగ్ చేస్తే భారత కుర్రాళ్ల జట్టును ఇబ్బంది పెట్టవచ్చు. ఆదివారం వాన ముప్పు లేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
ఈ మ్యాచ్‌లోనూ బౌలింగ్‌లో బుమ్రా పైనే అందరి దృష్టీ నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్, లయ అందుకుంటే ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు. ఐర్లాండ్‌తో తొలి టీ20లో అతడి బౌలింగ్ ఆశాజనకంగా కనిపించింది. భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే తిలక్, రింకు, శివమ్ దూబె ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. వెస్టిండీస్‌తో పర్యటనలో నిలకడగా రాణించిన తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మను వన్డే ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలనే వాదనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి అతడిపైనే నిలువనుంది. గత మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన ఈ హైదరాబాదీ కీలక మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com