IRE vs IND: కళ్లన్నీ బుమ్రా, తిలక్‌పైనే

IRE vs IND: కళ్లన్నీ బుమ్రా, తిలక్‌పైనే
నేడే ఐర్లాండ్‌తో తొలి టీ 20.... ఏడాది తర్వాత బుమ్రా రీఎంట్రీ

గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా పేస్‌ స్టార్‌ జస్ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah ) రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఐర్లాండ్‌(India vs Ireland)తో నేడు జరుగనున్న తొలి టీ20లో బుమ్రా సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. వన్డే ప్రపంచకప్‌(Men's ODI World Cup )నకు ముందు సత్తా చాటేందుకు, తమను తాము నిరూపించుకునేందుకు ఈ సిరీస్‌ కీలకంగా మారనుంది. వెస్టిండీస్‌ పర్యటనలో సత్తా చాటిన తెలంగాణ కుర్రాడు తిలక్‌ వర్మ, స్పీడ్‌ గన్‌ బుమ్రాపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైఉంది.


వెన్ను గాయం, శస్త్ర చికిత్స, పునరావస శిబిరం ఇలా చాన్నాళ్ల తర్వాత 29 ఏళ్ల బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌ బరిలోకి దిగుతున్నాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌కు ఈ సిరీస్‌ ద్వారా చివరి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో సిరీస్‌లో శాంసన్‌ పూర్తిగా నిరాశపరి చాడు. శాంసన్‌కు అవకాశమిస్తే అరంగేట్రం కోసం జితేశ్‌ శర్మ ఎదురు చూడక తప్పదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తా చాటిన రింకు సింగ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశముంది. తిలక్‌ వర్మ ఐర్లాండ్‌తో సిరీస్‌లోనూ సత్తాచాటితే ప్రపంచకప్‌ జట్టు ఎంపిక పోటీలోకి వచ్చే అవకాశముంది. రుతురాజ్‌, యశస్వి, రింకు, తిలక్‌, శాంసన్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది. మరో పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా గాయం నుంచి కోలుకుని ఈ సిరీస్‌తోనే పునరాగమనం చేస్తున్నాడు. అతనితో పాటు ఆల్‌రౌండర్లు శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌కూ ఇది పునరాగమనమే అవుతుంది.


విండీస్‌తో టీ20 సిరీస్‌ ఓటమి నేపథ్యంలో ఇప్పుడు ఐర్లాండ్‌ను తేలిగ్గా తీసుకుంటే మరోసారి మూల్యం చెల్లించక తప్పదు. ఇటీవల 2024 టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన ఐర్లాండ్‌ మంచి ఫామ్‌లో ఉంది. కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ సారథ్యంలో నిలకడగా రాణిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరపున ఆకట్టుకున్న పేసర్‌ జోష్‌ లిటిల్‌.. అంతర్జాతీయ క్రికెట్లోనూ దమ్ము చూపాలనే పట్టుదలతో ఉన్నాడు. గత సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్య ఛేదనలో 221 పరుగులు చేసి భారత్‌ను ఐర్లాండ్‌ భయపెట్టింది. ఇప్పుడు కూడా అలాంటి పోరాటాన్ని పునరావృతం చేయాలనే సంకల్పంతో ఉంది.

ఐర్లాండ్‌తో ఇప్పటివరకూ ఆడిన అయిదు టీ20ల్లోనూ భారత్‌దే విజయం. ఈసారి కూడా సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని బుమ్రా సేన పట్టుదలగా ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను 2-3 తేడాతో ఓడిపోయిన టీమ్‌ఇండియా ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నారు. స్టార్‌ క్రికెటర్లు ఎవరూ లేకపోయినా మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు టి20లకు టికెట్లన్నీ అమ్ముడయ్యాయని ఐర్లాండ్‌ బోర్డ్‌ ప్రకటించింది. 11,500 సీట్ల సామర్థ్యమున్న స్టేడియం ‘హౌస్‌ఫుల్‌’ అయ్యింది. అయితే శుక్రవారం డబ్లిన్‌లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో మ్యాచ్‌ సజావుగా సాగుతుందో వేచిచూడాలి.

Tags

Read MoreRead Less
Next Story