OLYMPICS: చరిత్ర సృష్టించిన మణికా బృందం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించిన మనిక బాత్రా బృందం... విశ్వ క్రీడల్లో టేబుల్ టెన్నిస్‌లో క్వార్టర్స్ చేరిన తొలి మహిళల జట్టుగా కొత్త చరిత్ర లిఖించింది. మణిక బాత్రా, ఆకుల శ్రీజ, అర్చన, మణిక బృందం అద్భుత ప్రదర్శన చేసి రొమేనియాను ఓడించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ అయిన టీమిండియా 3-2తో నాలుగో నంబర్ టీమ్ రొమేనియాపై విజయ దుంధుభి మోగించింది. క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ జట్టు.. అమెరికా లేదా జర్మనీ మధ్య జరిగే పోరులో విజేతతో తలపడనుంది. తెలుగు తేజం ఆకుల శ్రీజ-అర్చన జోడీ రొమేనియాకు చెందిన ఎడినా, సమారా జోడీని 3-0తో ఓడించింది. తర్వాతి మ్యాచ్‌లో మణికా బాత్రా... బెర్నాడెట్‌ను 3-0తో సునాయసంగా చిత్తు చేసింది. 11-5, 11-7, 11-7 తేడాతో బెర్నాడెట్‌పై మణికా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో భారత జట్టు రొమేనియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఎలిజబెత్ సమారాతో జరిగిన మూడో మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినా శ్రీజ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీజ ఓడిపోయినా రొమేనియాపై భారత్ 2-1తో ఆధిక్యంలోనే నిలిచింది. బెర్నాడెట్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అర్చన కామత్ ఓడిపోవడంతో భారత్, రొమేనియా పోరు 2-2తో సమమైంది. చివరి మ్యాచ్‌లో మనిక గెలవడంతో 3-2తో చరిత్ర సృష్టించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com