CWC2023: దండయాత్ర.. ఇది టీమిండియా దండయాత్ర

CWC2023: దండయాత్ర.. ఇది టీమిండియా దండయాత్ర
రోహిత్‌ సేన చేతిలో శ్రీలంక చిత్తుచిత్తు... 302 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం...

ప్రపంచకప్‌లో భారత్‌ జట్టు దండయాత్ర కొనసాగుతోంది. అప్రతిహాత విజయాలతో సాగుతున్న రోహిత్‌ సేన శ్రీలంకను చిత్తుచిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించిన టీమిండియా.... తర్వాత బుల్లెట్‌ లాంటి బంతులతో లంక బ్యాటర్లను బెంబేలెత్తించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌లను అలవోకగా ఓడించిన భారత జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. అది అలాంటి ఇలాంటి విజయం కాదు. 2011 ఫైనల్ తర్వాత ప్రపంచకప్‌లో తొలిసారి తలపడ్డ లంకపై రోహిత్‌ సేన 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వాంఖడె పిచ్‌పై భారత్‌ 357 పరుగులు చేస్తే.. టీమిండియా పేసర్ల ధాటికి లంక 55 పరుగులకే కుప్పకూలింది. ఘోర పరాభవంతో లంక ప్రపంచకప్‌ సెమీస్‌ రేసు నుంచి దాదాపు నిష్క్రమించగా.. ఏడో విజయంతో భారత్‌ సగర్వంగా సెమీస్‌లోకి అడుగు పెట్టింది .


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ నిర్ణయం సరైందే అనిపించింది. తొలి ఓవర్‌ రెండో బంతికే వికెట్‌ రోహిత్‌ శర్మ అవుటయ్యాడు. నాలుగు ఓవర్లలో రెండు మెయిడెన్లు వేశారు. దీంతో టీమిండియా నాలుగు ఓవర్లకు కేవలం 14 పరుగులే చేసింది. కానీ నెమ్మదిగా పుంజుకున్న భారత్‌ పరుగుల వేగం పెంచింది. శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. శుభ్‌మన్‌ గిల్‌ (92; 92 బంతుల్లో 11×4, 2×6), విరాట్‌ కోహ్లి (88; 94 బంతుల్లో 11×4), శ్రేయస్‌ అయ్యర్‌ (82; 56 బంతుల్లో 3×4, 6×6) అదరగొట్టడంతో మొదట భారత్‌ 8 వికెట్లకు 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోహ్లి 50 బంతుల్లో, శుభ్‌మన్‌ 55 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేశారు. అప్పర్‌కట్‌ ఆడబోయి శుభ్‌మన్‌ వికెట్‌ కీపర్‌కు దొరికిపోతే.. మదుశంక వేగం తగ్గించి వేసిన బంతికి కోహ్లి బోల్తా కొట్టాడు. తర్వాత శ్రేయస్‌ ఎక్కువ ఆలస్యం చేయకుండా షాట్లకు దిగడంతో మళ్లీ స్కోరు బోర్డు ఊపందుకుంది. రాహుల్‌ (21) అతడికి చక్కటి సహకారం అందించాడు. శ్రేయస్‌ కొట్టిన రెండు భారీ సిక్సర్లు స్టేడియాన్ని హోరెత్తించాయి. రాహుల్‌ ఔటయ్యాక వచ్చిన సూర్యకుమార్‌ (12) కూడా ఎక్కువసేపు నిలవకపోయినా.. శ్రేయస్‌ మాత్రం జోరు కొనసాగించాడు. మరో ఎండ్‌లో జడేజా కూడా ధాటిగా ఆడాడు. 36 బంతుల్లోనే 50కి చేరుకున్న శ్రేయస్‌.. చూస్తుండగానే 80లోకి వచ్చేశాడు. మదుశంక వేసిన 48వ ఓవర్‌ తొలి రెండు బంతులకు అతను సిక్సర్లు బాది 82 మీదికి రావడంతో సెంచరీ ఖాయమనిపించింది. కానీ మూడో బంతికి శ్రేయస్‌ను ఔట్‌ చేసిన మదుశంక అయిదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.


358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక భారత పేస్‌ త్రయం షమి, సిరాజ్‌ , బుమ్రా అసాధారణ ప్రదర్శనతో 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఏడు మ్యాచ్‌ల్లో అయిదో ఓటమి చవిచూసిన లంక సెమీస్‌ రేసుకు దాదాపుగా దూరమైంది. టాప్‌-8 బ్యాటర్లలో 0, 0, 1, 0, 1, 0, 0.. ఏడుగురి గణాంకాలివి. బుమ్రా వేసిన తొలి బంతికే నిశాంక ఎల్బీడబ్ల్యూ. సిరాజ్‌ తొలి బంతికి దిముత్‌ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇంకో నాలుగు బంతులకే సమరవిక్రమ పెవిలియన్లో. ముగ్గురూ డకౌటే. సిరాజ్‌, బుమ్రా చేసిన విధ్వంసం సరిపోదంటూ తర్వాత షమి వచ్చాడు. షమి అయిదు వికెట్లతో ఆ జట్టును పతనం అంచులకు తీసుకెళ్లాడు. జడేజా చివరి వికెట్‌తో ఆ జట్టు కథను ముగించాడు.

Tags

Read MoreRead Less
Next Story