Common Wealth Games : కామన్‌వెల్త్ గేమ్స్‌లో టాప్ 4లో భారత్..

Common Wealth Games : కామన్వెల్త్ క్రీడా సంగ్రామంలో భారత్ వెలిగిపోయింది. పతకాల పంటతో క్రీడాకారులు దూసుకుపోయారు. భారత కీర్తపతాకాన్ని, సత్తాను విశ్వవ్యాప్తం చేశారు. 72 దేశాలు పాల్గొన్న ఈ క్రీడా సంగ్రామంలో భారత్ ను టాప్ ఫోర్‌లో నిలిపారు.మొత్తంగా క్రీడల్లోనూ అగ్రదేశాలతో పోటీపడే సత్తా ఇండియాకు ఉందని భారత అథ్లెట్లు నిరూపించారు.
కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్ల ప్రదర్శన అదరహో అనిపించింది. గేమ్స్ రెండో రోజు నుంచే పతకాల వేట ప్రారంభించిన క్రీడాకారులు చివరి రోజు నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుని ఘనంగా ముగించారు. 200 మందికి పైగా అథ్లెట్లతో అడుగుపెట్టిన భారత్ ఓవరాల్‌గా 61 పతకాలతో నాలుగో స్థానంలోముగించింది. ఇందులో 50కి పైగా అథ్లెట్లు మొట్టమొదటిసారి కామన్వెల్త్‌లో అడుగుపెట్టి పతకాలు సాధించారు. 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో సరిగ్గా 22 స్వర్ణాలు గెలిచిన భారత జట్టు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలతో 61 మెడల్స్ గెలిచి... ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా తర్వాతి స్థానంలో నిలిచింది.
బర్మింగ్‌హామ్ క్రీడల్లో భారత స్టార్ మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో విజేతగా నిలిచి భారత్‌కు తొలి స్వర్ణం అందించింది. పెడ్లర్ శరత్ కమల్ చివరి గోల్డ్ అందించాడు. చివరి రోజు కూడా భారత్ హవా కొనసాగించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. ఇటు మెన్స్ సింగిల్స్ లోనూ లక్ష్యసేన్ పసిడి పతకం అందుకున్నారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్ల పంచ్‌లకు, రెజ్లర్ల పట్టుకు పతకాలు వచ్చి పడ్డాయి. పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్ పంగల్, మహిళల మినిమమ్ వెయిట్‌లో నితూ గంఘాస్‌లు బంగారు పతకాలు సాధించారు. తెలంగాణ అమ్మాయి ప్రపంచ వేదికపై భారత కీర్తి పతకాన్ని ఎగురవేసింది. కామన్వెల్త్ క్రీడల్లో ఈసారి కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణం కొల్లగొట్టింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియన్ పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినా పటేల్ చరిత్ర సృష్టించింది. పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకుంది. టీటీలో భారత తరఫున గోల్డ్ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది భవినా.ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం కాంస్య పతకాన్ని సాధించింది. ఇక భారత మహిళల క్రికెట్ జట్టు కామన్వెల్త్ లో తొలిసారిగా ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 66 పతకాలు సాధించిం మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఎడిషన్‌లో షూటింగ్ లేకపోవడంతో భారత్ పతకాల సంఖ్య తగ్గింది. గత ఎడిషన్‌లో షూటింగ్‌లో భారత్‌కు మొత్తం 16 మెడల్స్ వచ్చాయి. ఆ లెక్కన షూటింగ్ ఉండిఉంటే ఈసారి 80 మెడల్స్ దరిదాపుల్లోకి చేరేవి. మొత్తంగా క్రీడల్లోనూ అగ్రదేశాలతో పోటీపడే సత్తా ఇండియాకు ఉందని భారత అథ్లెట్లు నిరూపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com