T20 WORLDCUP: టీమిండియా బ్యాటర్ల ఊచకోత

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించారు. కీలకమైన ఈ నాకౌట్ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం ఆకాశమే హద్దుగా చెలరేగి, ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపింది. ముఖ్యంగా ఓపెనర్ సంజూ శాంసన్ తన దూకుడైన ఆటతో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించారు. కీలక సమయంలో బాధ్యతాయుతంగా ఆడుతూ టీమిండియాకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే సంజూ శాంసన్ దాడి ప్రారంభించారు. ఫోర్లు, సిక్సులతో ఇంగ్లండ్ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. మొత్తం ఏడు సిక్సులు, ఎనిమిది ఫోర్లతో 89 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. శాంసన్ వీరవిహారం ముందు ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా నిరుపాయంగా కనిపించారు. ఆయనకు తోడుగా శివమ్ దూబే 43 పరుగులు చేసి మంచి సహకారం అందించారు. ఇషాన్ కిషన్ 39 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేసి జట్టుకు కీలకమైన పరుగులు జోడించారు. తిలక్ వర్మ కూడా 21 పరుగులతో రాణించారు. అయితే సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు, అభిషేక్ శర్మ 8 పరుగులతో నిరాశపరిచారు.
మొత్తంగా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 253 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్, ఆదిల్ రషిద్ తలో రెండు వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా రనౌట్‌గా వెనుదిరిగారు. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇంగ్లండ్ జట్టు 254 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది. ఈ సెమీఫైనల్‌లో గెలిచిన జట్టు మార్చి 8న జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
