Praggnanandhaa: ప్రజ్ఞానందకు రూ.30 లక్షల చెక్‌

Praggnanandhaa: ప్రజ్ఞానందకు రూ.30 లక్షల చెక్‌
ప్రజ్ఞానంద దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడన్న స్టాలిన్‌.... దేశం గర్వించే ప్రదర్శన చేశాడంటూ ప్రశంసలు....

చెస్‌ ప్రపంచకప్‌ (Chess World Cup)లో సంచలన ప్రదర్శనతో రన్నరప్‌గా నిలిచిన తర్వాత తొలిసారి స్వదేశానికి వచ్చిన ప్రజ్ఞానంద (Praggnanandhaa)కు ఘన స్వాగతం లభించింది. చెన్నై విమానాశ్రయానికి వేలాది అభిమానులు తరలివచ్చి ఈ యువ గ్రాండ్‌మాస్టర్‌( young chess grandmaster)కు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రజ్ఞానంద నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్‌(MK Stalin) నివాసానికి వెళ్లాడు. సీఎం స్టాలిన్‌ ప్రజ్ఞానందపై ప్రశంసలు కురిపించారు. తమిళనాడుతోపాటు యావత్‌ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన కనబర్చాడని సీఎం( Tamin Nadu CM MK Stalin) కొనియాడారు. ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కును అందించి మెమెంటోను బహుకరించారు.


ప్రజ్ఞానందను కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ట్విట్టర్‌(X)లో స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. చిరస్మరణీయ విజయం సాధించిన తర్వాత ప్రజ్ఞానంద తిరిగి చెన్నైకి వచ్చాడని... అతడు సాధించిన విజయాలు తమిళనాడుతోపాటు యావత్‌ దేశానికి కీర్తిని తెస్తాయని కొనియాడారు. మున్ముందు కూడా ఇదే ఆటతీరుతో ప్రజ్ఞానంద అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. అనంతరం యువజన సంక్షేమం, క్రీడాశాఖ ఉదయనిధి స్టాలిన్‌(Sports Minister Udhayanidhi) కూడా ప్రజ్ఞానందను శాలువాతో సత్కరించారు.


ఆరేళ్లకే అండర్‌-7 ఇండియన్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచి ఆ తర్వాత అండర్‌-8, అండర్‌-10 ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లను ప్రజ్ఞానంద గెలిచాడు. ఆ తర్వాత 10 ఏళ్ల 9 నెలల వయసులో 2016లో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ మాస్టర్‌(ఐఎం) ఘనతను అందుకున్నాడు. 2018లో 12 ఏళ్ల 10 నెలల వయసులో రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్‌ తర్వాత గ్రాండ్‌మాస్టర్‌ హోదాను సాధించిన రెండో అతి పిన్న వయస్కుడిగా, భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌గా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పాడు. తాజాగా ప్రపంచకప్‌( FIDE World Cup 2023) చెస్‌ రన్నరప్‌గా నిలిచి తొలి అతి పిన్న వయస్కుడిగా చెస్‌ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు.

ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా ఏకంగా ఫైనల్‌కు చేరి ప్రజ్ఞానంద అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫైనల్లో అగ్రశ్రేణి ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌కు చెమటలు పట్టించాడు. టై బ్రేక్‌లో ఒత్తిడికి గురికావడంతో ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత చెస్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరిన రెండో భారత గ్రాండ్‌మాస్టర్‌గా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే ఆనంద్ మహింద్రా ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందిస్తానని ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story