MS Dhoni: హ్యాపీ బర్త్‌డే 'తలా' ధోనీ..

MS Dhoni: హ్యాపీ బర్త్‌డే తలా ధోనీ..
ధోనీ తన కెరీర్‌లో 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. 90 టెస్టులు ఆడిన ధోనీ 6 సెంచరీలతో 4876 పరగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్‌కీపర్‌గా ఉంటూ 634 క్యాచ్‌లు, 195 స్టంపౌట్‌లు చేశాడు.

భారత జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్, కెప్టెన్ కూల్, విధ్వంసకర ఆటగాడు, హెలిక్యాప్టర్ షాట్‌కు ఆధ్యుడు ఈ ఉపమానాలన్నీ ఒక్కరి గురించే. అతనే భారత మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ. 'తలా' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఎంఎస్.ధోనీ భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో విజయాలు, టైటిళ్లు గెలిచి భారత క్రికెట్‌లో లెజెండ్‌గా నిలిచాడు. తన కెప్టెన్సీ నిర్ణయాలు, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటం, అత్యంత వేగవంతమైన కీపింగ్ నైపుణ్యాలు, తన వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానం సాధించాడు. ICC T20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గిన ఏకైక కెప్టెన్‌ ఎంఎస్. ధోనీనే. జులై 7న నేడు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.


ట్రైన్ టికెట్ కలెక్టర్ నుంచి భారత క్రికెట్‌ జట్టుకు వరల్డ్‌కప్ అందించే దాకా ధోనీ జీవితప్రయాణం ప్రేరణనిస్తుంది. భారత క్రికెట్ కష్టకాలంలో ఉన్న 2007 సమయంలో భారత క్రికెట్ జట్టు పగ్గాలు అందుకున్న ధోనీ, తన నేతృత్వంలో మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌ని భారత్‌కి అందించాడు. టెస్టుల్లో భారత్‌ని అగ్రస్థానానికి చేర్చాడు. 1983 తర్వాత ఊరిస్తూ వచ్చిన వరల్డ్‌కప్‌ని 2011లో స్వయంగా సిక్స్‌ కొట్టి కప్‌ని భారత్ వశం చేసి దిగ్గజ క్రికెటర్ సచిన్‌కి ఘన వీడ్కోలు అందించాడు. ధోని సారథ్యంలోని జట్టు 2010, 2016 సంవత్సరాల్లో ఆసియా కప్, 2013 సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.


జార్ఖండ్‌లోని రాంఛీలో జన్మించిన ధోనీ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేశాడు. కెరీర్‌ మొదట్లో పొడవాటి జులపాల జుట్టుతో అభిమానుల్ని ఆకర్షించాడు. ధోనీ హెయిర్‌స్టైల్‌ని అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా మెచ్చుకున్నాడు. 2005లో విశాఖలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఇక అదే ఏడాది శ్రీలంకతో జైపూర్‌లో జరిగిన వన్డేలో 145 బంతుల్లో 15 సిక్స్‌లు, 10 ఫోర్లతో 183 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. 2014లో టెస్ట్‌ కెప్టెన్సీని, 2017లో వన్డే, టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

ధోనీ-ఐపీఎల్-సీఎస్‌కే(CSK)

ధోనీ లేకుండా ఐపీల్ చరిత్ర సాగదేమో. కేవలం ధోనీని చూడటానికే స్టేడియాలకు అభిమానులు వస్తుంటారు. ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే జట్టు 5 సార్లు ట్రోఫీని గెలిచింది. ఆడిన 14 సీజన్లలో 12 సార్లు ప్లే ఆఫ్స్‌కి వెళ్లింది. రైజింగ్ పూనె తరఫున ఒకసారి కప్ సాధించి పెట్టాడు.


అవార్డులు-ప్రశంసలు

2008, 2009 సంవత్సరాల్లో వరుసగా ICC వన్డే ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. భారత ప్రభుత్వం ధోనీని 2007లో రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు ఎంపిక చేసింది. 2009లో పద్మశ్రీ, 2018లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. ధోనీ భారత టెరిటోరియల్ ఆర్మీలో ప్యారాచూట్ దశంలో లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో కూడా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story