Kabaddi : కబడ్డీలో భారత్ విజయకేతనం..8వ సారి కప్ కొట్టిన భారత్

ఆసియా పురుషుల కబడ్డీ ఛాంపియన్‌షిప్-2023 ఫైనల్లో గెలిచి భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత ఆటగాళ్లు ఇరాన్‌ను చిత్తుచేశారు. ఫైనల్లో ఇరాన్ జట్టును 42-32 పాయింట్ల తేడాతో ఓడించింది. బుసాన్‌లో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ విజయంతో భారత్ ఆడిన 9 టోర్నీల్లో 8 సార్లు కప్ కైవసం చేసుకున్నట్లయింది. భారత కెప్టెన్ పవన్ షెరావత్ 10 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆట ప్రారంభమైన 10 వ నిమిషంలో భారత డిఫెండర్లు పలు టాకిల్స్ చేయడం, పవన్ షెరావత్, అస్లాం ఇనాందార్‌లు పాయింట్లు తేవడంలో సఫలం కావడంతో ఇరాన్ జట్టును ఆలౌట్ చేశారు. దీంతో భారత్ 11-4 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత భారత ఆటగాళ్లు దూకుడు పెంచి ఆడారు. ఈ క్రమంలో ఇరాన్ జట్టుకు కూడా కొన్ని బోనస్ పాయింట్లు పొందగలిగింది. 19వ నిమిషంలో మరోసారి ఇరాన్‌ను ఆలైట్ చేసి స్కోర్‌ను 23-10 ఆధిక్యంలో నిలిపారు.
2వ అర్ధభాగంలో ఇరాన్ దూకుడు పెంచి ఆడటంతో ఆట ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఇరాన్ కెప్టెన్ వరుసగా 2 పాయింట్లు, 1 సూపర్ రైడ్ ద్వారా ఎక్కువ పాయింట్లు రాబట్టాడు. మ్యాచ్ రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా భారత్ ఆధిక్యం 38-31 కి తగ్గింది. దీంతో మ్యాచ్ చివరి రెండు నిమిషాల్లో రసవత్తరంగా మారింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత ఆటగాళ్లు ఆధిక్యాన్ని కాపాడుకోవడంతో విజయం భారత్ వశమైంది. ఆసియా ఛాంపియన్‌షిప్ కప్ భారత్ దాసోహమైంది.
ఫైనల్‌కు మందు జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 64-20 పాయింట్ల భారీ తేడాతో ఓడించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇరాన్ రెండవ స్థానంలో నిలిచింది. లీగ్ స్టేజ్‌లో భారత్ కొరియాపై 76-13 పాయింట్లతో భారీ తేడాతో నెగ్గింది.
భారత్‌కు తర్వాత సవాల్ సెప్టెంబర్ 23 అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూలో జరగనున్న ఆసియా క్రీడల్లో ఎదురవనుంది. 2018 ఆసియా క్రీడల సెమీస్‌లో భారత్‌ను ఇరాన్ ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగనుంది. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలన్న పట్టుదలతో భారత ఆటగాళ్లు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com