మమ్మల్ని అమెరికాకు పంపండి.. కేంద్రానికి భారత రెజ్లర్ల లేఖ

ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ శర్మ తమని లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టిన సాక్షిమాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా వంటి అగ్రశ్రేణి రెజ్లర్లు శిక్షణ కోసం తమని అమెరికా పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రానున్న ఆసియా క్రీడల ట్రయల్స్ శిక్షణ కోసం రెజ్లర్లను అమెరికాకి అనుమతించాలని క్రీడల మంత్రిత్వ శాఖకి లేఖ రాశారు. అమెరికాలో శిక్షణ పొందాలనుకునే రెజ్లర్ల డిమాండ్ తాము పరిశీలిస్తున్నామని, దీనిపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA), క్రీడల మంత్రిత్వ శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాయని ఐఓఏ జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ చౌబే తెలిపారు.
ఆసియా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల జాబితాను జులై 15 వరకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా(OCA)కు పంపాలి. అడ్-హక్ కమిటీ భారత నుంచి పాల్గొనే క్రీడాకారులకు ట్రయల్స్ నిర్వహించి ఆలోపు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA)కు పంపాలి. ఈ నేపథ్యంలో గడువును పొడిగించాలని IOA ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA)ని కోరినప్పటికీ, భారత్‌కు అనుకూలంగా వస్తుందో లేదో చెప్పలేమని చౌబే అన్నారు. రెజ్లర్లు చేసిన అభ్యర్థనను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA)కి పంపామన్నరు. మరే ఇతర స్పోర్ట్స్ ఫెడరేషన్లు కూడా ఇదే విషయాన్ని కోరుకోవడం లేదని, ఆసియా క్రీడల ఆతిథ్య దేశం చైనా హామీ కోరిందన్నారు.
ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఒలింపిక్ డే ఈవెంట్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, రెజ్లర్ గీతా ఫోగట్ హాజరయ్యారు.
"భారత ఒలంపిక్స్ అసోసియేషన్‌గా ప్రతి అథ్లెట్‌కు అత్యుత్తమ స్థాయి సౌకర్యాలను అందించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాము" అని చౌబే తెలిపారు.
భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ 2024లో జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌కు ఆటగాళ్ల సన్నాహకాలు బాగా జరుగుతున్నాయని తెలిపారు.
"భారత రెజ్లర్లతో పాటు ప్రతీ క్రీడాకారుడికి అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడానికి IOA ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పారిస్ సమ్మర్ ఒలంపిక్స్‌కి ఆటగాళ్లు చాలా బాగా సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఒలంపిక్స్‌లో మన అథ్లెట్లు మంచి ప్రదర్శన కనబరుస్తారు" అని పీటీ ఉష ఆశాభావం వ్యక్తం చేశారు.
జూలై 6న జరగాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఎన్నికలు జూలై 11 వరకు వాయిదా పడ్డాయి. WFI అధ్యక్ష పదవి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, 4 వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ జనరల్, ట్రెజరర్, 2 జాయింట్ సెక్రటరీ పోస్టులు, 5 ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకోనున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో బ్రిజ్ భూషణ్‌పై కేసు కూడా నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com