Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ లెజెండ్ 'సునీల్ ఛెత్రీ'

భారత పురుషుల ఫుట్‌బాల్‌ని గత రెండు దశాబ్ధాలుగా భారం మోస్తూ సునీల్ ఛెత్రి భారత ఫుట్‌బాల్‌కు ముఖచిత్రంగా మారాడు. కెప్టెన్‌గా భారత జట్టును అన్నీ తానై నడిపిస్తున్నాడు. భారత ఫుట్‌బాల్ రంగంలో సునీల్ ఛెత్రీని ఒక లెజెండ్‌గా చెప్పవచ్చు. ఆడిన 2 దశాబ్ధాల్లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు సాధించడమే కాకుండా, భారత్‌కు కూడా ఎన్నో విజయాలు అందిస్తూ వస్తున్నాడు. మన దేశం తరఫున అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరొందాడు.
140 అంతర్జాతీయ మ్యాచుల్లో 92 గోల్స్ కొట్టిన సునీల్ ఛెత్రి, ప్రస్తుతం ఆడుతున్న యాక్టివ్ ఆటగాళ్లలో 3వ స్థానంలో నిలిచాడు. ఫుట్‌బాల్ సూపర్‌స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ మాత్రమే ముందున్నారు. మొత్తంగా అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. క్లబ్, దేశం తరపున మొత్తంగా 244 గోల్స్ సాధించాడు.
2002 సంవత్సరంలో మోహున్ బగాన్‌తో మొదటి మ్యాచ్ ఆడాడు. అనంతరం సీనియర్ విభాగంలో తన మొదటి గోల్‌ను నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(2022-23)లో నమోదుచేశాడు. తన మొదటి అంతర్జాతీయ గోల్‌ని 2005 సంవత్సరంలో, ఆడిన తొలి మ్యాచ్‌లోనే దాయాది దేశం పాకిస్థాన్‌పైనే కొట్టాడు. 2011 సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన శాఫ్(SAFF) ఛాంపియన్‌షిప్‌లో 7 గోల్స్ కొట్టి, భారత ఫుట్‌బాల్ లెజెండ్ IM విజయన్ 6 గోల్స్ రికార్డును బద్దలుకొట్టాడు. ఆ సీజన్‌లో భారత్‌కి కప్ తెచ్చిపెట్టాడు.
గోల్స్..రికార్డ్స్
సునీల్ ఛెత్రీ భారత జట్టు, ఇతర లీగ్ జట్ల తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు, ఘనతలు సాధించిపెట్టాడు. 2010 లో USA మేజర్ లీగ్ సాకర్ టీం కన్సాస్ విజార్డ్స్ తరపున, 2012 సంవత్సరంలో పోర్చుగీల్ క్లబ్ స్పోర్టింగ్ సీపీ రిజర్వ్ టీం తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
భారత్‌లో జరిగే మేజర్ ఫుట్‌బాల్ లీగుల్లో పాల్గొని తనదైన ముద్ర వేశాడు. ఈస్ట్ బెంగాల్(2008-09), డెంపో(2009-10), ఇండియన్ సూపర్ లీగ్‌లో ముంబయ్ సిటీ ఎఫ్‌సీ(2015-16), బెంగళూరు ఎఫ్‌సీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. బెంగళూరు తరఫున 2014, 2016 సంవత్సరాల్లో ఐ-లీగ్, ఇండియన్ సూపర్ లీగ్(ISL-2019), సూపర్ కప్(2018) అందించాడు. అలాగే బెంగళూరు క్లబ్‌ను 2016లో AFC కప్ ఫైనల్‌కి తీసుకెళ్లాడు.
భారత జట్టుకు 2007, 2009, 2012 సంవత్సరాల్లో నెహ్రూ కప్, 2011, 2015, 2021 సంవత్సరాల్లో దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్(SAFF) ఛాంపియన్‌షిప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2008 లో AFC ఛాలెంజ్ కప్‌లో జట్టు తరఫున కీలక పాత్ర వహించి, 27 యేళ్ల AFC ఆసియన్ కప్‌కి అర్హత సాధించడంలో సాయపడ్డాడు.
సికింద్రాబాద్‌లో పెరిగిన సునీల్ ఛెత్రి భారత జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ, ప్రస్తుతం జరుగుతున్న శాఫ్ కప్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొడుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com